దివ్యాంగుల 'సదరం' పరేషాన్..15 నిమిషాల్లో స్లాట్స్ పూర్తి

దివ్యాంగుల  'సదరం' పరేషాన్..15 నిమిషాల్లో స్లాట్స్ పూర్తి
  •     ఆ కొద్దీ సమయంలోనూ మొరాయిస్తున్న వెబ్ ‌‌సైట్​
  •     మీ సేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు
  •     జిల్లాకేంద్రంలోనే  క్యాంపు నిర్వహణతో అవస్థలు
  •     మండల కేంద్రాల్లో క్యాంపులు ఏర్పాటుకు డిమాండ్
  •     సర్టిఫికెట్లు వచ్చినా పింఛన్లు మంజూరు కాక బాధితుల అవస్థలు.

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో సదరం సర్టిఫికెట్లు అందక అర్హులైన దివ్యాంగులు పరేషాన్​ అవుతున్నారు. సదరం క్యాంపు నిర్వహణకు హెల్త్​ డిపార్మెంట్ ఆఫీసర్లు షెడ్యూల్ రిలీజ్ చేసిన గంటలోపే  స్లాట్ బుకింగ్ అయిపోతోంది.  ఆ కొద్దీ సమయంలోనే వెబ్ ‌‌సైట్​ మొరాయిస్తుండడంతో స్లాట్స్ బుక్ ​అవడం లేదు.  దీంతో నెలల తరబడి మీ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ తక్కువ టైంలో ఎన్ని స్లాట్స్​ఇస్తున్నారో.. అప్లికేషన్లు ఎన్ని వస్తున్నాయో కూడా తెలియడం లేదు. స్లాట్స్​సంఖ్య పెంచడంతోపాటు ప్రతి మండలంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరుతున్నారు.  

15 నిమిషాల్లో స్లాట్స్ కంప్లీట్  

జగిత్యాల జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్​గత నెల ఏప్రిల్ 28న స్లాట్ బుకింగ్ కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 3న ఆర్థో, 10న విజివల్ ‌‌, 17న ఆర్థో, 24న హియరింగ్, 26న ఆర్థో, 31న ఎంఆర్ కేటగిరీల దివ్యాంగులకు స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఇచ్చారు.  మీ సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుకింగ్ చేసే వెబ్ ‌‌సైట్​తరచూ మొరాయిస్తోంది. 10 నుంచి 15 నిమిషాలు మించి పని చేయడం లేదని మీ సేవా కేంద్రాల ఆపరేటర్లు చెబుతున్నారు. స్లాట్ బుకింగ్ కాకపోతే షెడ్యూల్ ప్రకారం సదరం క్యాంపునకు హాజరు అయ్యే అవకాశం లేదు. దీంతో అర్హత ఉన్నా పెన్షన్ అందుకోలేకపోతున్నామని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇలా స్లాట్ దొరక్క ప్రతి నెలా 50 నుంచి 60 మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే పెన్షన్ తీసుకునే దివ్యాంగులు తమ డిజెబిలిటీని రెన్యూవల్​ చేసుకోలేకపోతున్నారు. అర్హత ఉన్నా కొందరికీ డిజెబిలిటీ టెస్ట్ ‌‌లో పర్సంటేజీ తక్కువ వస్తే.. వారు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సర్టిఫికెట్లపై సిగ్నేచర్ లేక ఇబ్బందులు 

జగిత్యాల జిల్లాలో 17,374 మంది దివ్యాంగులు పెన్షన్ పొందుతున్నారు. అయితే 2022 ఆగస్ట్ నుంచి సదరం సర్టిఫికెట్లు పొందిన వారికి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయలేదు. సంబంధిత వెబ్ ‌‌సైట్ ఓపెన్ కాకపోవడంతో పెన్షన్​ మంజూరు చేయడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. అలాగే 2010, 2012లో జారీ చేసిన ‌‌సర్టిఫికెట్లలో డాక్టర్ల సిగ్నేచర్ లేకపోవడం దివ్యాంగులకు శాపంగా మారింది. వీటిపై పెన్షన్ పొందుతున్నా బస్ పాస్  సౌకర్యం నిలిపివేశారు. వంద శాతం డిజెబిలిటీ ఉన్న దివ్యాంగులు ఆన్ ‌‌లైన్ ‌‌లో సర్టిఫికెట్​ తీసుకునే వెసులుబాటు ఉన్నా జిల్లా ఆస్పత్రిలో ఆఫీసర్ల నిర్లక్ష్యంతో నకలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మండలాల్లో క్యాంపుల ఏర్పాటుకు సర్కార్​ నో 

జిల్లాకేంద్రంలోనే  సదరం క్యాంపు నిర్వహిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మండలాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్​ఉంది. అయితే ఇటీవల జరిగిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ ‌‌లో దివ్యాంగులకు సదరంలో స్లాట్ బుక్ కాకపోవడంతో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ ‌‌ ‌‌రావుతోపాటు ఇతర సభ్యులు మంత్రి కొప్పుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకేంద్రంలోనే క్యాంపు ఉండడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని, మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేయాలని కోరారు.  ఇలా మండలాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తే అర్హులు పది మంది వస్తే అనర్హులు 90 మంది వస్తారని, జిల్లా ఆస్పత్రిలో నిర్వహించే క్యాంపులోనే సర్టిఫికేట్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 
''ఈ చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు మెండే చందు(12).  ఇతడికి మూడేళ్ల వయస్సున్నప్పుడు కాళ్లు, చేతులు పనిచేయకుండా పోవడంతో అప్పటి నుంచి పూర్తిగా మంచానికే  పరిమితమయ్యాడు. చందుకు ఊహా తెలియకముందే తల్లి రజిత చనిపోగా, కొడుకు ట్రీట్ ‌‌మెంట్​ కోసం డబ్బు సంపాదించేందుకు తండ్రి సారయ్య గల్ఫ్ బాటపట్టాడు. దీంతో నానమ్మ కాయకష్టం చేస్తూ చందు బాగోగులు చూస్తోంది. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో పింఛన్ కోసం ఐదేళ్లుగా తిరగ్గా 2019 లో ఏడాది వ్యాలిడిటీతో సదరం సర్టిఫికేట్ ఇచ్చారు. రెండేళ్లు గడిచినా పింఛన్​ మంజూరు కాలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. చివరగా 2022 డిసెంబర్ లో సదరం సర్టిఫికెట్ ఐదేళ్ల వ్యాలిడిటీతో ఇచ్చినా ఇప్పటివరకు పింఛన్​రాలేదు”.

ప్రతి నెలా సదరం క్యాంపు

జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ప్రతినెలా షెడ్యూల్ ప్రకారం సదరం క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి సుమారు 17వేల మందికిపైగా సర్టిఫికెట్లు మంజూరు చేయడంతో పెన్షన్ పొందుతున్నారు.. అన్ని మండలాల్లో క్యాంపులు ఏర్పాటు చేయడం కుదరదు. జిల్లా హాస్పిటల్ ‌‌లో నిర్వహించే క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి.

 ‌‌ ‌‌ – డీఆర్డీవో ఏపీడీ లక్ష్మీనారాయణ

దివ్యాంగుల ఇబ్బందులు తీర్చాలి 

2010, 2012 లో ప్రభుత్వం జారీ చేసిన సదరం సర్టిఫికేట్స్ ‌‌పై డాక్టర్ల సిగ్నేచర్ లేకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బస్ పాసులు మంజూరు కాకపోవడం తో ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాల్లో సదరం క్యాంపుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచించాలి. 

దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జగిత్యాల