ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో క‌రోనా కేసులు చాలా తక్కువ

ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో క‌రోనా కేసులు చాలా తక్కువ

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే, మిలియన్ జనాభాకు భారతదేశంలో నమోదు అవుతున్న కరోనా వైరస్ కేసులు అతి తక్కువేన‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓఎస్‌డీ రాజేశ్‌ భూషణ్ ఈ విష‌యంపై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో కరోనా పాజిటివ్‌ రికవరీ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా రోగుల రికవరీ రేటు 62 శాతానికి పెరిగిందన్నారు. కరోనా తో చనిపోయిన వారిలో 11 శాతం మంది 30 నుంచి 44 ఏళ్ల వయసు వారే ఉన్నారని చెప్పా‌రు. 32 ‌శాతం మంది 45-59 ఏళ్ల వారు, 39 శాతం మంది 60 నుంచి 70 శాతం మధ్య వయసున్న వారు, 14 శాతం మంది 75 ఏళ్ల పై వారున్నారని తెలిపారు. కరోనా రికవరీ లోమార్చి 15 న 10% శాతం ఉంటే , మే 3 నాటికి 26.59%, మే 31 నాటికి 47.40%, జూలై 9 నాటికి 62శాతంగా ఉందని తెలిపారు.

గాలి ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తుందన్నది కొంతమంది సైంటిస్టుల అభిప్రాయమ‌ని, అందుకే ప్రధానమంత్రి.. ప్రతి ఒక్కరూ రెండు గజాల దూరం పాటించాలని కోరారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం మిలియన్ జనాభాకు 538 కరోనా కేసులు ఉన్నాయని రాజేశ్ భూషణ్ తెలిపారు. భారతదేశంలో మిలియన్ జనాభాకు మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందన్నారు. దేశంలో కరోనా వైరస్ పరీక్షల సామర్థ్యం పెంచడానికి , పరీక్షా సామర్థ్యాన్ని వేగవంతం చేయడానికి, ప్రైవేట్ ల్యాబ్‌లు ఇప్పుడు NABL అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడ్డాయ‌న్నారు. సమాంతరంగా వారి దరఖాస్తును ICMR కు సమర్పించారని, అవి ఒక నెలలో అక్రిడిటేషన్‌ను పూర్తి చేసుకుని పరీక్షలు చేయటానికి అనుమతించబడతాయని చెప్పారు‌. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 1,132 పరీక్షా ప్రయోగశాలలు పనిచేస్తున్నాయ‌ని తెలిపారు.

దేశీయంగా రెండు వ్యాక్సిన్లు చాలా వేగంగా తయారవుతూ ప్రయోగ దశలో ఉన్నాయని రాజేశ్ భూష‌ణ్ అన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ల తయారీలో భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని ఆయ‌న తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో అయితే వ్యాక్సిన్ రావడానికి రెండేళ్లు పడుతుందని, ఈ సంక్షోభ కాలంలో దీన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలనే కేంద్ర అభిమతం అన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ ఫేస్ వన్, ఫేస్ టు ట్రావెల్స్ ప్రారంభం కాబోతున్నాయన్నారు.భారత్ బయోటెక్, కాడిలా హెల్త్‌కేర్ సంస్థలు జంతువులపై ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకొని మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయని తెలిపారు.