వనపర్తి జిల్లాలో కనెక్షన్లు ఎక్కువ.. సిబ్బంది తక్కువ..విద్యుత్ సేవల్లో జాప్యం

వనపర్తి జిల్లాలో కనెక్షన్లు ఎక్కువ.. సిబ్బంది తక్కువ..విద్యుత్ సేవల్లో జాప్యం

 

  • ఇబ్బంది పడుతున్న వినియోగదారులు
  • వనపర్తి జిల్లాలో పరిస్థితి

వనపర్తి, వెలుగు: జిల్లాలో ఏటా వివిధ కేటగిరీల్లో విద్యుత్​కనెక్షన్లు పెరుగుతున్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడంతో విద్యుత్​సేవల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే కొన్ని గంటలపాటు చీకట్లోనే గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

దినసరి కూలీలతో పనులు

2019‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జూనియర్ లైన్ మెన్ పోస్టులను భర్తీ చేశారు. మళ్లీ ఇప్పటివరకు ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. కరెంట్​కనెక్షన్లకు సరిపడా సిబ్బంది​లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. ప్రైవేట్​వ్యక్తులను డైలీ లేబర్​గా తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. అర్ధరాత్రి విద్యుత్​సరఫరాలో సమస్య తలెత్తితే పునరుద్ధరణకు ఎక్కువ సమయం పడుతోంది. మరోవైపు దినసరి కూలీలతో పనులు చేయిస్తుండడంతో వారికేదైనా ప్రమాదం జరిగితే బాధ్యులెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

ఏడాదిలో 20 వేల కనెక్షన్లు..

జిల్లాలో గతేడాది సెప్టెంబర్​వరకు 1,35,780 డొమెస్టిక్​ విద్యుత్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1,55,600కు పెరిగింది. 20 వేల కనెక్షన్లు పెరిగినా సిబ్బంది పెరగకపోవడంతో వినియోగదారులకు నాణ్యమైన సేవలందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో 77,802 మందికి లబ్ధి చేకూరుతోంది. 

ఉండాల్సిన సిబ్బంది..

విద్యుత్ సెక్షన్​పరిధిలో ప్రతీ 1,500 సర్వీస్​కనెక్షన్లకు ఒక జూనియర్​ లైన్​మ్యాన్​, ప్రతీ 3 వేల కనెక్షన్లకు ఒక అసిస్టెంట్​లైన్​మ్యాన్​చొప్పున ఉండాలి. 4,500 విద్యుత్ కనెక్షన్లకైతే ఒక లైన్​మ్యాన్​, ఒక లైన్​ ఇన్​స్పెక్టర్​ ఉండాలి. సెక్షన్​ మొత్తానికి ఒక సీనియర్​ లైన్​ ఇన్ స్పెక్టర్, ఫోర్​మ్యాన్​ఉండాలి. కానీ, ఎక్కడా ఈ విధంగా లేరు.