విశ్వాసం : సంకల్పం దృఢంగా ఉండాలి

విశ్వాసం : సంకల్పం దృఢంగా ఉండాలి

ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మనసును బలంగా ఉంచుకోవాలి. నిరాశను దరిచేరనీయకూడదు. అంతేనా... ఆటంకం కలిగితే... ఆ వంకతో పని మానేయకూడదు. సంకల్పబలంతో ముందుకు సాగాలి.


అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు.  వారు ఏడుగురూ ఒకరోజు వేటకు వెళ్లారు. అలా వెళ్లినవారు అడవి జంతువులను వేటాడకుండా... ఏడు చేపల్ని పట్టారు. ఏడు చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు.  ‘చేపా! చేపా! ఎందుకు ఎండలేదు?’ అని అడిగారు.  ‘గడ్డిమేటు అడ్డు వచ్చింది’ అని చెప్పింది.  ‘గడ్డిమేటు ఎందుకు అడ్డొచ్చావు?’ అని అడిగితే..., ‘నన్ను ఆవు తినలేదు’ అని చెప్పింది.  ‘ఆవు... ఆవు.. ఎందుకు తినలేదు?’ అంటే, ‘నా యజమాని నాకు గడ్డి వేయలేదు’ అంది.  ‘యజమాని.. యజమాని.. ఎందుకు గడ్డి వేయలేదు’ అంటే, ‘మా మనవడు ఏడ్చాడు’ అని చెప్పాడు.  ‘అబ్బాయీ! అబ్బాయీ! ఎందుకు ఏడ్చావు?’ అని అడిగితే ‘చీమ కుట్టింది’ అన్నాడు.  ‘చీమా! చీమా! ఎందుకు కుట్టావు?’ అని అడిగితే, ‘నా బంగారు పుట్టలో వేలు పెట్టి బెల్లం ముక్క తీసుకుంటే కుట్టనా’ అంది.  ఈ కథ మనకి ఏం చెప్తోంది. ఒక పని చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అన్నిటినీ అధిగమించాలే కానీ, ఏదో ఒక సాకుతో పని మానేయకూడదని. ఇందులో రాజకుమారులు చేపలు పట్టారా అనేది విషయం కాదు. అంతటి రాజకుమారులు వెళ్లి చేసిన పని అది. చేయవలసిన పని కాకుండా చేపలు పట్టి, అవి ఎండలేదనే సాకుతో ఏ పనీ చేయకుండా సోమరిగా కూర్చున్నారు. 

సుందరకాండలో... హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరాడు. బయలుదేరింది మొదలు మైనాకుడు, సురస, సింహిక, లంఖిణి, ఇంద్రజిత్తు, లంకలో ఉండే బ్రహ్మరాక్షసులు... ఎంతోమంది అడ్డగించారు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సీతాన్వేషణ మానలేదు. ఎప్పటికప్పుడు తనను తాను ఉత్తేజపరచుకుంటూ ముందుకుసాగాడు. హనుమంతుని సంకల్పం దృఢమైంది. కాబట్టి సరిగ్గా అదే సమయంలో సీతమ్మ కనిపించింది. తాను పడిన కష్టానికి ఫలం లభించినందుకు ఆనందపడ్డాడు.  హనుమంతుడు మనకు ఏం చెప్తున్నాడు... ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మనసును బలంగా ఉంచుకోవాలి. నిరాశను దరిచేరనీయకూడదు. అంతేనా... ఆటంకం కలిగితే... ఆ వంకతో పని మానేయకూడదు. సంకల్పబలంతో ముందుకు సాగాలి అని బోధిస్తున్నాడు.

ఏడు చేపల కథలో రాజకుమారులు ఏదో ఒక వంకతో పని జరగలేదని చెప్పారు. అదే ఏడు చేపల కథలోని రాజకుమారులు... చేప ఎండలేదని తెలిసినప్పుడు ఎవరి మీదో నింద వేయటానికి అందరినీ ప్రశ్నించే బదులు ఆ చేపను తీసుకెళ్లి ఎండలో పెడితే సరిపోయేది. కనీసం దానిని ఎండలో పెట్టడానికి కూడా ప్రయత్నించలేదు. కూర్చున్న చోటు నుంచి కదలలేకపోయారు. అంటే... కార్యసిద్ధి జరగాలని వారు సంకల్పించలేదు.

ఇక భారతంలోకి వస్తే... పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు. తమ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. ఒకానొక సమయంలో... కీచకుడు ద్రౌపదిని వెంటాడుతూ నిండు కొలువులోకి వచ్చాడు. ఆ ప్రవర్తనతో భీముడిలో రక్తం ఉడికిపోయింది. పక్కనే ఉన్న మహావృక్షాన్ని పెకిలించాడు. అలా పెకిలించగలిగే శక్తి ఉన్నవాడు కేవలం భీముడు మాత్రమేనని అందరికీ తెలుసు. దానితో వారి అసలు వేషాలు బయటపడబోయాయి. కానీ, ధర్మరాజు సమయస్ఫూర్తితో, ‘వంట చెరకు కోసం, పచ్చటి చెట్టును పెకిలిస్తావా’ అని భీముడితో అని, ఆ ఆటంకం నుంచి బయటపడేశాడు. వారి అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తైంది. ధర్మరాజు సమయానికి స్పందించకపోతే ఏమయ్యేది. మళ్లీ పన్నెండేండ్లు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేయాల్సి వచ్చేది. కార్యసాధన కోసం బుద్ధికి పదును పెట్టాలి.

ప్రపంచ సాహిత్యంలో.. కార్యసిద్ధికోసం ఎంతోమంది కవులు కృషి చేసినట్లు తెలుస్తోంది. బీర్బల్, తెనాలిరామలింగడు, మౌల్వీ నజీరుద్దీన్, కాళిదాసు, మహాభారతంలో పాండవులకు శ్రీకృష్ణుడు... అడుగడుగునా సాయపడుతూనే ఉన్నాడు. పని పూర్తిచేయాలనే సంకల్పం దృఢంగా ఉండాలి. సోమరితనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే ఏ కార్యమైనా సఫలం అవుతుంది. ఇదీ ఏడు చేపల కథ మనకు చెప్తున్న వ్యక్తిత్వ వికాసం.


-  డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232