
- ఎస్సారెస్పీ ఫేజ్-2 ఘనత దివంగత ఆర్డీఆర్ దే
- జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: దేవాదుల నీళ్లను తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తానని, అదే తమ ప్రభుత్వ సంకల్పమని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రూ.1000 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకునేందుకు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లాకు ఎస్సారెస్పీ నీటిని రప్పించిన ఘనత దివంగత నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిదేనని కొనియాడారు.
వైఎస్ఆర్ పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు ఆర్డీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నిర్వహించిన రక్తతర్పణం కార్యక్రమంలో తాము పాల్గొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎస్సారెస్పీ నీటి కోసం ఆర్టీఆర్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయన్నారు. అటువంటి నేత పేరు ఎస్సారెస్పీ ఫేజ్–-2 కు పెట్టాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో తన ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారన్నారు.
దామోదర్ రెడ్డి పేరు చరిత్రలోనే నిలిచి పోయేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని, ఆర్డీఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు. సూర్యాపేట జిల్లాకు ఎస్సారెస్పీ నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. జిల్లాకు రైలు మార్గం మంజూరైందన్నారు.
వానాకాలం ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రూ. 24 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకుడు సారత్ రౌత్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.