రాచరికానికి కేరాఫ్​ దేవరకొండ ఖిల్లా

రాచరికానికి కేరాఫ్​ దేవరకొండ ఖిల్లా

నల్గొండ చుట్టు పక్కల జిల్లాలో దేవరకొండ ఖిల్లా అంటే తెలియని వాళ్లే ఉండరు. ఇది ఒక లోకల్ టూరిస్ట్ స్పాట్‌‌. నల్గొండ జిల్లాలో ఎవరింటికైనా దూర ప్రాంతాల నుంచి చుట్టాలు వస్తే.. కచ్చితంగా దేవరకొండ ఖిల్లాను చూపించాల్సిందే. కొబ్బరి నీళ్ల లాంటి నీళ్లుండే బావి, ప్రజల కోసం పెద్ద పెద్ద ధాన్యాగారాలు, బురుజులు... ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే అంత ఫేమస్‌‌ ఈ ఖిల్లా.

దేవరకొండ ఖిల్లా రేచర్ల రాజుల గొప్పదనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. క్రీ.శ. 14వ శతాబ్దంలో రేచర్ల వంశరాజుల్లో నాలుగో తరానికి చెందిన ఎర్ర దాచానాయుడు ఈ ఖిల్లా నిర్మాణం మొదలుపెట్టాడు. కానీ..  ఐదో తరానికి చెందిన మొదటి సింగమనాయకుడు ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఏడుకొండలను కలుపుతూ భూమట్టానికి 500 అడుగుల ఎత్తులో ఖిల్లాను కట్టించారు. శత్రు దుర్బేధ్యంగా ఉండేందుకు, కొండలను కలిపేందుకు అప్పటి రాజులు రాతి గోడను కట్టించారు. ఇప్పటికీ ఆ గోడ చెక్కు చెదరకుండా ఉంది. ఖిల్లాలో చిన్నా, పెద్దా కలిపి మొత్తం 360 బురుజులు, 9 మహా ద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కొలనులు, 13 ధాన్యాగారాలు ఉన్నాయి. గుర్రపుశాలలు, నాట్య కచేరీల కోసం ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. 

ఎన్నో ఆలయాలు 

ఆ ఖిల్లా పరిసరాల్లో అప్పటి రాజులు ఎన్నో ఆలయాలు కట్టించారు. వాటిలో రామాలయం, ఆంజనేయస్వామి ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఏకాదశి, మహాశివరాత్రి రోజుల్లో వేలాది మంది భక్తులు ఖిల్లా పైకి ఎక్కి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే.. కొందరు గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వకాలు జరుపుతుండడంతో పురాతన కట్టడాలు, విగ్రహాలు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. ఖిల్లాను కట్టించకముందే ఈ గుట్టపై అనేక దేవతా విగ్రహాలు ఉన్నాయి. అందుకే ఈ కొండను ‘‘దేవతల కొండ’’ అని పిలిచేవాళ్లు. అదే కొంత కాలానికి ‘‘దేవరకొండ’’గా మారిందని ఆర్కియాలజిస్ట్‌‌లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ దుర్గానికి ఎనిమిది వైపులా ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను శిలను తొలిచి చెక్కారు. దుర్గాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు ఈ విగ్రహాలను చెక్కారట. 

సాహితీ వైభవం 

కవి సార్వభౌముడుగా పేరున్న శ్రీనాథుడు.. దేవరకొండ రాజ్య పాలకుడైన లింగమనాయుడిని శరణు కోరి వచ్చినట్టు చెప్తుంటారు. లింగమనాయుడు సాహితీ పక్షపాతి కావడంతో కవులను ఆదరించాడు. సాహిత్య ప్రియులకు ప్రోత్సాహం అందించేందుకు తన రాజ్యంలో సాహితీ సభలు, కవి గోష్టులు ఏర్పాటు చేసి, తెలుగు భాషను దశదిశలా చాటాడు. 

పకడ్బందీగా కట్టిన కోట

ఖిల్లా ప్రధాన ద్వారంపై పూర్ణకుంభం చెక్కించారు. వ్యవసాయ భూములకు సాగు నీరు అందించేందుకు మాధవనాయనికుంట (పర్వతరావు చెరువు), వేదాద్రి చెరువులు తవ్వించారు. దొంగలను, నేరగాళ్లను శిక్షించేందుకు ప్రత్యేకంగా ‘దొంగల బండ’ పేరుతో ఒక నిర్మాణం ఉంది. ఇక్కడే శిక్షలు అమలు చేసేవాళ్లు. శత్రువులపై దాడి చేసేందుకు అప్పట్లో రాజులు వాడిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. శత్రు సైనికులు దాడులు చేసినప్పుడు రాజ్యంలో ప్రజలు తిండికి, నీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అప్పటి పాలకులు ఖిల్లాపై పెద్ద ఎత్తున కొలనులు, చేద బావులను తవ్వించారు. ఖిల్లాలో పెద్ద పెద్ద ధాన్యాగారాలు కట్టించారు. ఖిల్లా కింది భాగంలో ఐదు పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయి.

దాడుల వల్ల కరువు ఏర్పడినా ప్రజలు ఆకలితో అలమటించకూడదని వీటిని కట్టించారు. ఈ ధాన్యాగారాల్లో ధాన్యం నిల్వలు ఎప్పుడూ ఉండేవి. వాటిల్లో లక్షా ఇరవై ఐదు వేల పుట్ల వడ్లను నిల్వ ఉంచే వాళ్లని ‘వెలుగోటి వారి వంశచరిత్ర’లో కవి సదాశివరాత్రి రాశారు. దీన్ని బట్టి రాజ్యంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నాటి రాజులు ఎంతముందు చూపుతో ఉన్నారో తెలుస్తోంది.  దేశమంతా కరువు వచ్చినా ఈ ఖిల్లాపై వందల అడుగుల ఎత్తులో ఉన్న బావులు, గుండాలు, కోనేరుల్లో మాత్రం నీళ్లు  నిండుగా ఉంటాయి. ఖిల్లా దుర్గంపై ఉన్న కోనేరు లోతు చాలా ఎక్కువని చెప్తుంటారు. అంతేకాదు.. దాని లోతు ఎంత అనేది ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. ఆర్కియాలజిస్ట్‌‌లు రీసెర్చ్‌‌ చేసినా దాని అంతు చిక్కలేదు. ఏడు మంచాల నులకను కోనేరులో వేసినా... అది అంచు వరకు వెళ్లలేదన్న నానుడి ఇప్పటికీ వినబడుతోంది. 

కొబ్బరినీళ్ల బావి

దేవరకొండ ఖిల్లా ప్రధాన ద్వారం దాటిన తర్వాత వచ్చే రెండో గడి..  సైనికులు, ప్రజలు సేద తీర్చుకోవడానికి వీలుగా ఉండేది. అందులో పచ్చీసు, పులిజూదం లాంటి ఆటలు ఆడుకునేందుకు రాతి కట్టడాలపై చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. దుర్గం కింది నుంచి పైకి వచ్చే దారిలో కాలభైరవుని విగ్రహాన్ని చెక్కించారు. అక్కడినుంచి ఇంకాస్త కిందికి వెళ్తే.. అప్పట్లో రాజుల కోసం ఏర్పాటు చేసిన ‘‘కోట్ల బావి” కనిపిస్తుంది. అందులోని నీళ్లు.. కొబ్బరినీళ్ళ కంటే తియ్యగా ఉంటాయట. ఈ బావి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. అయినా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూర్తిగా ఎండిపోలేదు. మరో విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్రతి ఇంటికీ మంచి నీళ్లు అందుతున్నా, మినరల్​ వాటర్ అందుబాటులో ఉన్నా ఈ ప్రాంత ప్రజలు చాలామంది కోట్లబావి నీళ్లనే తాగుతున్నారు. ఈ బావిలోని నీళ్లను తాగితే ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడి ప్రజల నమ్మకం. 

గుప్త నిధుల కోసం.. 

ఖిల్లా ప్రధాన ద్వారం దగ్గర ఉన్న నంది విగ్రహం 15 ఏండ్ల క్రితం వరకు ఈ కోటకే స్పెషల్‌‌ ఎట్రాక్షన్‌‌. కానీ.. ఆ విగ్రహంలో గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు  ఎత్తుకెళ్లి పగులగొట్టారు. ప్రస్తుతం ఇది పోలీస్​స్టేషన్ దగ్గర పడి ఉంది. రాజులు ఉపయోగించిన ఫిరంగులు ఖిల్లాపై ఉండేవి. ఇప్పుడు అవి కూడా మాయమైపోయాయి. 
నాగార్జునసాగర్​–‌‌‌‌హైదరాబాద్​ రోడ్డుకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకొండ ఖిల్లాను టూరిస్ట్ ప్లేస్‌‌గా మారిస్తే దగ్గర్లోని వైజాగ్​ కాలనీ, ఏకేబీఆర్, డిండి ప్రాజెక్ట్​, బాపన్​కుంట, గాజుబేడం గుహలు, తెలంగాణ ఊటీగా పేరుగాంచిన దేవరచర్ల మునిస్వామి ఆలయం, పొగిళ్ళ వాటర్​ఫాల్స్‌‌కు టూరిస్ట్‌‌లు పెరుగుతారు.  ::: పసుపులేటి శివప్రసాద్, దేవరకొండ, వెలుగు