ప్రగతి లేని పల్లెలు నిధుల్లేక ఆగుతున్న పనులు

ప్రగతి లేని పల్లెలు నిధుల్లేక ఆగుతున్న పనులు
  • సర్పంచ్​లు అప్పులు చేసి వర్క్స్​ చేసినా బిల్లులియ్యని రాష్ట్ర సర్కార్​
  • ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు, ఉపాధి హామీ ఫండ్సే దిక్కు
  • 5,145 గ్రామ పంచాయతీలకు సొంత బిల్డింగ్స్​ కూడా లేవ్​

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర సర్కారు చెప్తున్న ‘పల్లె ప్రగతి’ కాగితాలకే పరిమితమైతున్నది. నిధులు లేక ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతున్నాయి. సర్పంచ్​లు అప్పులు చేసి కొన్ని పనులు చేయించినా వాటిని కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. పారిశుధ్య పనులకు కూడా పైసలు ఇవ్వడం లేదు. ఊర్లలో ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల్లో 80 శాతానికి పైగా నిధులు కేంద్ర ఫైనాన్స్​ కమిషన్, ఉపాధి హామీ నుంచి తీసుకున్నవే. కనీసం ఉపాధి హామీ నిధులతో నిర్మించిన వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మెయింటెయిన్​ చేయడం లేదు. డంపింగ్​ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, రైతు వేదికలు లాంటివి సరైన నిర్వహణ లేక మూలకు పడుతున్నాయి. ఏటా ‘పల్లె ప్రగతి’ అంటూ 15 రోజులు  హడావుడి చేయడమే తప్ప.. పల్లెల అభివృద్ధిని రాష్ట్ర సర్కార్​ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

నిర్వహణకూ పైసలిస్తలే

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు నిర్మించాలని 2019లో నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఉపాధి హామీలో ఈ పనులను ప్రతిపాదించి, ఇప్పటి వరకు 12,622 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి చేశారు. వీటన్నింటికీ 80 శాతం ఫండ్స్​ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో నుంచే ఖర్చు చేశారు. డంపింగ్​ యార్డులను కూడా ఉపాధి హామీ నిధులతోనే కట్టారు. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్​ పల్లె ప్రకృతి వనం, మల్టీ లేయర్​ ఎవెన్యూ ప్లాంటేషన్స్​కు కూడా అవే నిధులు వాడారు. 

వీటి నిర్మాణానికి  రాష్ట్ర సర్కారు నిధులు ఇవ్వకపోయినా.. కనీసం నిర్వహణ కూడా పైసలు ఇస్తలేదు. దీంతో చాలా చోట్ల పల్లె ప్రకృతి వనాలు గడ్డి మొలిచి.. మొక్కలు ఎండిపోతున్నాయి. వైకుంఠ ధామాలకు కొత్తలో రంగులద్ది.. ఆ తర్వాత వదిలేశారు. చాలా చోట్ల వైకుంఠ ధామాల్లో   సరైన నీటి వసతి కూడా లేదు.  రైతు వేదికలదీ అదే పరిస్థితి. డంపింగ్​ యార్డులను తొలుత కొన్ని రోజులు చెత్త సేకరణకు ఉపయోగించినా.. ఇప్పుడు ఏ పండుగకు ముందో.. తర్వాతనో నెల రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. చెత్త సేకరణతో పాటు వివిధ పనులకు ఉపయోగపడే ట్రాక్టర్లు కూడా డీజిల్​ లేక పక్కన పెట్టేశారు. మరికొన్ని చోట్ల  ట్రాక్టర్లకు కిస్తీలు కట్టలేక సీజ్​ చేసిన సంఘటనలూ ఉన్నాయి.  ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇస్తే.. నిర్వహణ చేపడుతామని సర్పంచ్​లు అంటున్నారు.  అసలే ఇప్పటికే తాము చేపట్టిన అనేక పనులకు ప్రభుత్వం నిధులు రాక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  2014–15 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్​ వరకు ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 25 వేల కోట్లు రిలీజ్​ చేసింది. 

చెప్పిన దాంట్లో ఇచ్చేది సగం లోపే!

15వ ఫైనాన్స్​ కమిషన్​ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామాలకు రూ. 1,415 కోట్ల నిధులు వచ్చాయి. వీటికి సమానంగా రాష్ట్ర సర్కారు నుంచి నిధులు ఇస్తామని చెప్పినా.. అందులో ఇచ్చింది దాదాపు 600 కోట్లే.   ఆ మధ్య ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందన్న ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్‌‌ఎంఎస్‌‌ను తెరపైకి తెచ్చింది. పీఎఫ్​ఎంఎస్​ కింద  పంచాయతీలన్నీ బ్యాంక్​ ఖాతాలు తెరిచాయి. ఆ ఖాతాల్లో నిధులు పడగానే.. రాష్ట్ర సర్కార్​ విద్యుత్ బిల్లులకు కట్​ చేసుకున్నది.

ప్రపోజల్స్ పంపినా ఆఫీసులు కడ్తలే

రాష్ట్రవ్యాప్తంగా 5,145 గ్రామాల్లో పంచాయతీ ఆఫీస్ ల నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపారు. కట్టించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేయడం తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు.  500 జనాభా కలిగిన 4,383 గ్రామాలను, తండాలను 2018 ఆగస్టులో పంచాయతీలుగా సర్కారు మార్చింది. ఈ కొత్త జీపీలతోపాటు  మరికొన్ని పాత జీపీలకు ఆఫీసుల కోసం సొంత బిల్డింగ్స్​ లేవు. చాలా చోట్ల అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో ఉన్న డిమాండ్​ను బట్టి రూ. 500 నుంచి  2,500 వరకు కిరాయిని సర్పంచులు తమ జేబుల నుంచి కట్టాల్సి వస్తున్నది. కొన్ని తండాల్లోనైతే గుడిసెల్లోనే జీపీ ఆఫీసులు నడుస్తున్నాయి. 

ఆ పంచాయతీల్లో  రేషన్​కూ కష్టాలే 

రాష్ట్రంలో దాదాపు 3,700 తండాలను రెండున్నరేండ్ల కింద గ్రామ పంచాయతీలుగా మార్చినా.. అక్కడ ఇప్పటివరకు కొత్త రేషన్​ షాపులు  మంజూరు కాలేదు. దీంతో  ప్రతినెలా సబ్సిడీ బియ్యం కోసం మళ్లీ పక్క ఊర్లకు అక్కడివాళ్లు వెళ్లాల్సి వస్తున్నది. పంచాయతీలుగా మారిన తండాల్లో 500 కార్డులలోపే ఉండటంతో  కొత్త షాపులు మంజూరు చేయడం లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. పాత ఉత్తర్వులకు సవరణ చేసి.. రేషన్​ షాపులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.