
- నిధుల కొరతతో నిలిచిన పనులు
- ప్రారంభానికి నోచుకోని పనులు పూర్తయిన భవనాలు
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు కొనేండ్లుగా పూర్తవడం లేదు. ప్రభుత్వ భవనాల్లో కొన్ని అసంపూర్తిగా మిగిలిపోగా మరికొన్ని పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. చేర్యాల పట్టణంలో రూ.17 కోట్లు మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ.1.30 కోట్లతో చేపడుతున్న ఎంపీడీవో ఆఫీస్, రూ.1.34 కోట్లతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. రూ.3 కోట్లతో నిర్మించిన నాజ్ వెజ్ మార్కెట్, రూ.1.50 కోట్లతో మార్కెట్ యార్డులో నిర్మించిన 18 షాపులను ప్రారంభించడం లేదు. 4 మండలాలకు కేంద్రబిందువైన చేర్యాల పట్టణంలో అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నత్తనడకన ఐవోసీ పనులు
ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వంలో 2018లో ప్రారంభించిన ఐవోసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీనికి మొదట రూ.15 కోట్లు తర్వాత మరో రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ముగ్గురు కాంట్రాక్టర్లు మారడంతో పనులు నత్తనడకన సాగాయి. 80 శాతం పూర్తయినా మిగతా పనులు మూడేండ్లుగా నిలిచిపోయాయి.
రోడ్లపైనే మాంసం విక్రయాలు..
చేర్యాల పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాన్ వెజ్ విక్రయానికి ప్రత్యేకంగా నిర్మించిన మార్కెట్ రెండేండ్లుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో నాన్ వెజ్ మార్కెట్లో కొనసాగాల్సిన మాంసం అమ్మకాలు ప్రస్తుతం రోడ్డుపైనే సాగుతున్నాయి. అంబేద్కర్ సెంటర్ లోని మున్సిపల్ కార్యాలయంతోపాటు అప్పటివరకు అక్కడున్న 48 షాపులను కూల్చివేసి 2022 లో రూ.3 కోట్లతో నాన్ వెజ్ మార్కెట్పనులు ప్రారంభించి పూర్తి చేశారు. కాగా వ్యాపారులకు మార్కెట్లో స్థలం కేటాయించాల్సి పట్టించుకోవడం లేదు. నిర్మాణం పూర్తయినా నాన్ వెజ్ మార్కెట్ ఖాళీగా ఉండడంతో మున్సిపాలిటీకి ప్రతీ నెల దాదాపు రూ.2 లక్షల నష్టం వస్తోంది. ఈ మార్కెట్ నిర్మాణంతో చిరు వ్యాపారులకు స్థలం లేకుండా పోగా ప్రస్తుతం వారాంతపు సంత నిర్వహించే పరిస్థితి లేదు.
ఐకేపీ భవన్ లో ఎంపీడీవో ఆఫీస్
చేర్యాల పట్టణంలో నిర్మిస్తున్న ఎంపీడీవో ఆఫీస్, అంబేద్కర్ భవన్ నిధుల కొరతతో నిలిచిపోయాయి. ఎంపీడీవో కార్యాలయాన్ని జీ ప్లస్ వన్ పద్ధతిలో రెండు స్లాబ్‌లు వేసి, గోడలు నిర్మించిన తర్వాత పనులు ఆగిపోయాయి. దీంతో ఆఫీస్‌ను తాత్కాలికంగా ఐకేపీ భవన్ లో ఏర్పాటు చేశారు.
షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించట్లే..
చేర్యాల మార్కెట్ యార్డులో పనులు పూర్తయిన షాపింగ్ కాంప్లెక్స్ ను అధికారులు ప్రారంభించడం లేదు. రెండేండ్ల కింద దాదాపు రూ.1.50 కోట్ల వ్యయంతో 20 కమర్షియల్ షాప్‌ల పనులకు శ్రీకారం చుట్టారు. నిర్మాణం పూర్తయి ఏడాదవుతున్నా ప్రారంభానికి చర్యలు తీసుకోవడం లేదు.