ప్రాణహిత పుష్కరాలను పట్టించుకోని ప్రభుత్వం

ప్రాణహిత పుష్కరాలను పట్టించుకోని ప్రభుత్వం
  • పుష్కరాలకు పూర్తికాని ఏర్పాట్లు
  • ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ హామీలు

మంచిర్యాల/ ఆసిఫాబాద్/జయశంకర్ భూపాలపల్లి: ప్రాణహిత పుష్కరాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  భక్తులు మండిపడుతున్నారు. పన్నెండేళ్ల కోసారి వచ్చే పుష్కరాలపై చిన్నచూపు చూస్తోందంటున్నారు. సమయం దగ్గరపడినా ఇబ్బందులు పనులు మొదలు పెట్టలేదంటున్నారు భక్తులు. 

ప్రాణహిత పుష్కరాలు

రాష్ట్రంలోనే పుట్టి ఇక్కడే అంతర్లీనమయ్యే జీవనది ప్రాణహిత. గోదావరి నదికి ప్రాణహిత ప్రధాన ఉపనది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడి హెట్టికి పైభాగంలో పెన్ గంగా, వార్దా నదుల కలయితో ప్రాణహిత నది పుట్టింది. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాలేశ్వరం వరకు 113 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ప్రాణహిత కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. గోదావరి నది ఎప్పటికి ఎండిపోకుండా జలసిరులు అందిస్తూ ప్రాణహిత పేరును సార్థాకం చేసుకుంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాణహిత నది పుష్కరాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

ప్రాణహితనది ఎక్కువగా తెలంగాణ-మహారాష్ట్రకి సరిహద్దులోప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో తుమ్మిడిహెట్టి నుంచి  కాలేశ్వరం వరకు ఎంతో ఘనంగా పుష్కరాలను నిర్వహించారు. ప్రాణహిత జన్మస్థానమైన తుమ్మిడిహెట్టి దగ్గర పుష్కరఘాట్లు, షవర్ బాత్ తో పాటు మహిళలు బట్టలు మార్చుకునేందుకు, స్నానాలకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. ఆనాడు కట్టిన పుష్కరఘాట్లే ఇప్పటికీ తుమ్మిడిహెట్టి దగ్గర దర్శమిస్తాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో తుమ్మిడి నుంచి పుష్కర ఘాట్ వరకు సీసీ రోడ్డును వేశారు. గ్రామపంచాయతీ ఆధర్యంలో తాత్కాలిక దుకాణాల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి.అయితే నదిలో గడ్డి, పిచ్చిమొక్కలు అపరిశుభ్రత ఉండడంతో నదిలో స్నానం చేయడానికి భయపడుతున్నారు భక్తులు. పుష్కరఘాట్లలో మట్టి పోరుకపోయి ఉంది. 2010లో 50వేల నుంచి లక్షమంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. ఈసారి భక్తుల తాకిడి తుమ్మిడిహెట్టి దగ్గర ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఘనంగా...

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట దగ్గర అధికారికంగా ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. పది కోట్ల నిధులు కేటాయించారు. ప్రాణహిత పుష్కరాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింది. రోజుకు లక్ష మంది భక్తులు ప్రాణహిత నది పుష్కరాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రాణహిత పుష్కరాల పేరును ప్రస్తావించడం లేదనే విమర్ర్శలు వస్తున్నాయి. 

ఆచరణలోకి రాని హామీలు...

ప్రాణహిత పుష్కరాలపై గత ఏడాది డిసెంబర్ 28న  చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, పిండ ప్రదానాలకు అనుకూలమైన స్థలాలు, పార్కింగ్, రవాణా, మంచినీటి, విద్యుత్ సరఫరాపై చర్చించారు. అవసరమైన ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపాలని అధికారులకు ఆదేశించారు. దీంతో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి 35 కోట్ల ఫండ్స్ అవసరం ఉంటుందని ప్రపోజల్స్ పంపించారు అధికారులు. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, నిధులు కేటాయించలేదు.ఈనెల 13 నుంచి 24 వరకు పన్నెండు రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరుగనున్నాయి. అవతలి వైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత పుష్కరాలకు  ఘనంగా ఏర్పాట్లు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఇవతలి వైపు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 

లక్ష్మీబ్యారేజీ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాలి...

జయశంకర్ జిల్లా కాళేశ్వరం దగ్గర భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మహారాష్ట్ర సిరోంచ తాలుకా నగరం దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వం పుష్కర ఘాట్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడే అధికారికంగా ప్రాణహిత పుష్కరాలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. నగరం పుష్కర ఘాట్ కాళేశ్వరం కు పది కిలోమీటర్ల దూరం లోనే ఉంటుంది. మహారాష్ట్ర, ఒడిశాతో పాటు రాష్ట్రం నుంచి వచ్చే భక్తులు కాళేశ్వరం దగ్గర గోదావరిలో స్నానాలు చేసి ముక్తీశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల  ప్రాణహిత నది ప్రవాహం ఆగిపోయింది. లక్ష్మీబ్యారేజీ బ్యాక్ వాటర్ స్టోరేజీ ఉండడంతో ప్రాణహిత పరుగులు పెట్టడం లేదు. నీళ్లు నిలిచిపోయి వున్నాయి. పుష్కరాల సమయంలో నైనా లక్ష్మీబ్యారేజీ గేట్లను లిఫ్ట్ చేయాలంటున్నారు భక్తులు. నీటిని వదలడం వల్ల  ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తాయని .. ఇందులో స్నానం చేస్తే ఏ బ్బందులు ఉండవంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాణహిత పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్