లక్ష్మీ చెన్నకేశవ టెంపుల్ కు రోడ్డేది?

లక్ష్మీ చెన్నకేశవ టెంపుల్ కు రోడ్డేది?

రెండేళ్ల కింద శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
అదే స్థలంలో అన్నపూర్ణ క్యాంటీన్, టీ, సమోసా సెంటర్లు
కబ్జా చేసేందుకే అంటున్న ప్రతిపక్షాలు

గద్వాల, వెలుగు : గద్వాల కోటలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయానికి వెళ్లేందుకు రోడ్డు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేండ్ల కింద బ్రహ్మోత్సవాల సమయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాత బస్టాండ్ వైఎస్సార్ సర్కిల్  దగ్గర నుంచి రోడ్డు వేస్తామని చెప్పి మంత్రాలయం పీఠాధిపతి, మున్సిపల్ చైర్మన్  బీఎస్ కేశవులుతో కలిసి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ విషయంపై మాట్లాడడం లేదు. ఇదిలా ఉంటే అదే స్థలంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయడం, టీ, సమోసా సెంటర్ తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పేదలకు రూ.5 కే భోజనం ముసుగులో కోట్లు విలువ చేసే స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని అంటున్నారు. 

రోడ్డు నిర్మాణంపై సప్పుడు చేస్తలే..

రోడ్డుకు శంకుస్థాపన చేసి రెండేండ్లు గడిచినా ఎమ్మెల్యేతో పాటు నాయకులెవరూ సప్పుడు చేస్తలేరు. గతంలో ఈ స్థలాన్ని ప్రైవేట్  వ్యక్తులు కబ్జా చేయగా, మున్సిపల్ ఆఫీసర్లు తొలగించారు. ఇక్కడి నుంచి రోడ్డు వేస్తే కోట డెవలప్​ అవుతుందనే ఆలోచనతో శంకుస్థాపన చేసినా, పనులు స్టార్ట్ చేయకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత బస్టాండ్  వైఎస్సార్  చౌరస్తా దగ్గర రోడ్డు స్థలం చాలా విలువైంది. క్యాంటీన్  పెట్టేందుకు గద్వాల పట్టణంలో అనువైన స్థలాలు చాలా ఉన్నా, గుడికి వెళ్లేందుకు రోడ్డు నిర్మించాలని నిర్ణయించిన జాగాలో ఎందుకు పెట్టారనే విషయం చర్చనీయాంశంగా మారింది. 

భక్తులకు తప్పని తిప్పలు..

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ బ్రహ్మోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం కోటలో వెలిసిన ఈ గుడి లోపలికి వెళ్లేందుకు ఒకే దారి ఉంది. రోడ్ ఎంట్రన్స్ లోనే కార్ల పార్కింగ్, ఎంఏఎల్డీ జూనియర్, డిగ్రీ కాలేజీలు ఉండడంతో బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు విషయం తెలియదు..

పాత బస్టాండ్  దగ్గర రోడ్డు కోసం భూమిపూజ చేసిన సంగతి తెలియదు. ప్రస్తుతం అక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. గవర్నమెంట్  స్థలాలు కబ్జా కాకుండా చూస్తాం. ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తాం.

- నర్సింలు, మున్సిపల్​ కమిషనర్, గద్వాల