యాదగిరిగుట్టపై భారీ వర్షం

యాదగిరిగుట్టపై  భారీ వర్షం
  • ఎడతెగని వానతో యాదగిరి గుట్టపై భక్తులు ఆగం
  • ప్రసాద విక్రయ కేంద్రంలోకి నీరు
  • యాదాద్రి, సూర్యాపేటలో పొంగుతున్న వాగులు 

యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు : యాదాద్రి, సూర్యాపేట జిల్లాను ముసురు విడువడం లేదు. రెండు మూడు రోజుల నుంచి కొన్నిచోట్ల ఓ మోస్తారుగా కురుస్తుంటే.. మరికొన్ని చోట్ల భారీగా వాన పడుతోంది. ఎడతెగని వానతో యాదగిరిగుట్టపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులకు బయట ఎలాంటి షెల్టర్లు లేకపోవడంతో వర్షంలో తడవకుండా తప్పించుకోలేకపోయారు. కొందరు భక్తులు మాడవీధుల్లో గంటల తరబడి వేచి చూశారు. అయినా వాన తగ్గిపోవడంతో కొండపైన ఉన్న బస్ బే వరకు భక్తులు వానలో తడుస్తూ వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న కవర్లను కప్పుకుని భక్తులు పరుగులు పెట్టారు. పిల్లలను చంకనెత్తుకుని బస్ బే వైపు పరుగులు తీశారు.  భద్రతా సిబ్బంది కూడా విధులు నిర్వర్తించడానికి ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఆలయం లోపల కూడా వాటర్ లీకేజీలు బయటపడుతున్నాయి. ప్రసాద విక్రయ కేంద్రంలోకి నీళ్లు చేరాయి. దీంతో సిబ్బందితో పాటు భక్తులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. పాదం మునిగే వరకు నీళ్లు చేరడంతో సిబ్బంది నిల్చోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.

మరోవైపు కృష్ణశిలతో పునర్నిర్మించిన ప్రధానాలయం, మాడవీధుల్లో సైతం లీకేజీలు కనిపించాయి. యాదాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ 747.8 మిల్లీ మీటర్ల వర్షాపాతం  నమోదైంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వానతో నెమిల, రాజాపేట, దూది వెంకటాపురం మీదుగా ఆలేరు పెద్ద వాగులోకి వరద నీరు చేరుతోంది. ఆలేరు, కొలనుపాక, బచ్చన్నపేట రోడ్డు మీదుగా వాగు ప్రవాహం సాగుతుండడం తో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. 

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 288.4మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వగా మోతే మండలంలో అత్యధికంగా 32.4మి.మీ.ల వర్షం కురిసింది. హైదరాబాద్ ఎగువ నుండి వరద వస్తుండడంతో మూసీ ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 1880 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ఎగువ నుండి 2663.13క్యూసెక్కుల ప్రాజెక్టు కు చేరుతుండడంతో ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు ప్రస్తుతం 642.60 అడుగుల నీటి మట్టం కొనసాగుతున్నది.