వైకుంఠద్వారంలో.. రామయ్య దర్శనం

వైకుంఠద్వారంలో.. రామయ్య దర్శనం
  • భద్రాద్రికి భారీగా తరలివచ్చిన భక్తజనం
  • నేటి నుంచి నిత్య కల్యాణాలు పునరుద్ధరణ

భద్రాచలం, వెలుగు :  శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించాడు. లక్ష్మీదేవి సీతగా మారింది. శేషుడు లక్ష్మణుడయ్యాడు. శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన దక్షిణ అయోధ్యపురి నిజంగానే ఇల వైకుంఠపురిని తలపించింది. ఉదయం 5 గంటల సమయంలో ధూపదీపాలు.. గుగ్గిలం పొగల నడుమ, జేగంటలు మారుమోగుతుండగా వేదమంత్రోచ్ఛరణలు మధ్య వైకుంఠ ఉత్తరద్వారాలు తెరుచుకున్నాయి. 108 ఒత్తులతో నక్షత్ర హారతిని స్వామికి ఇచ్చారు. శరణాగతి దండకం అయ్యాక ఏకాదశి పూట ఉత్తర ద్వార విశిష్టతను వేదపండితులు వివరించారు.

దట్టంగా మంచు, చలి ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శేషపాన్పుపై శ్రీమహావిష్ణువు అవతారంలో కొలువుదీరిన రామయ్యను ఉత్తరద్వారాన దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్​ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ప్రత్యేక పూజలు చేశారు. 

ఘనంగా తిరువీధి సేవ

ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠ రాముడు అనంతరం తిరువీధి సేవకు తరలి వెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్‍, నమ్మాళ్వార్‍, మరో వాహనంపై ఆండాళ్లమ్మ వారు, హనుమద్‍వాహనంపై లక్ష్మణస్వామి, గజ వాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తికి తిరువీధి సేవ జరిగింది. 

తొలి అభిషేకం భక్తరామదాసు పేరిట

శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు తొలి అభిషేకం భక్తరామదాసు పేరిట స్థానిక తహసీల్దారు శ్రీనివాస్‍ నిర్వహించారు. భక్తరామదాసు తహసీల్దారుగా ఉన్న కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సమయంలో స్వామివారికి తిరుప్పావై గోష్టి, బాలబోగం, తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం స్వామివారిని ఉత్తరద్వారం వద్దకు చేర్చి గరుడ వాహనంపై అధిష్ఠింపజేశారు. 

రాపత్​ ఉత్సవాలు షురూ..

ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్​పత్​ ఉత్సవాలు ముగిసి రాపత్​ సేవలు షురూ అయ్యాయి. పగల్​పత్ ఉత్సవాల సందర్భంగా నిలిచిపోయిన నిత్య కల్యాణాలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రాపత్​ సేవలో భాగంగా శనివారం సాయంత్రం ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ వైకుంఠ రాముడిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.