కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

కొమురవెల్లి, వెలుగు: శ్రావణ మాసం రెండో ఆదివారం కావడంతో  కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ఉదయమే స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించి మల్లన్నకు బోనం చేసి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

అనంతరం ఒడి బియ్యం పోసి స్వామి వారిని దర్శించు కున్నారు. తమ కోరికలు తీర్చాలంటూ గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి వేడుకున్నారు. అనంతరం కొండపైన రేణుక ఎల్లమ్మ తల్లికి కల్లు, బెల్లం పానకంతో సాకపెట్టి బోనం చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు సౌకర్యాలను ఆలయ ఈవో అన్నపూర్ణ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్ పర్యవేక్షించారు.