
- స్వామి వారి దర్శనానికి ఐదు గంటల టైం
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి ఆదివారం రాత్రే వేములవాడకు చేరుకున్న భక్తులు సోమవారం ఉదయం ఆలయ ధర్మగుండంలో స్నానమాచరించిన అనంతర స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామి వారి దర్శనానికి ఐదు గంటలు పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారి ప్రసాదం కౌంటర్, కోడెల టికెట్ కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి.
రద్దీ కారణంగా గర్భగుడి దర్శనం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్‌లో ఉన్న ఓ భక్తుడికి ఫిట్స్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సతీశ్ మరికొందరు భక్తులు అతడిని హాస్పిటల్‌కు తరలించారు. సోమవారం ఒక్కరోజే సుమారు 80 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.