మేడారం జాతర: ఇక్కడ బెల్లమే బంగారం

మేడారం జాతర:  ఇక్కడ బెల్లమే బంగారం

మహాముత్తారం, వెలుగు : మేడారం జాతరకు, బెల్లానికి వీడదీయరాని --సంబంధం ఉంది. తల్లులకు సమర్పించే బెల్లాన్ని బంగారమని పిలుస్తారు. దీన్నే నైవేద్యంగా సమర్పిస్తారు. కాకతీయుల కాలం నుంచే ఇది కొనసాగుతోంది. ఒకప్పుడు వాహనాలు అందుబాటులో లేని కాలంలో వన దేవతల దర్శనానికి ఎడ్లబండ్లపై వచ్చేవారు. మైళ్ల కొద్దీ ప్రయాణించి వచ్చి మేడారంలో దాదాపు వారం గడిపేవారు.

ఈ క్రమంలో ఆకలైనప్పుడు తొందరగా శక్తినిచ్చే బెల్లంతో తయారు చేసే ఆహార పదార్థాలను తినేవారు. బెల్లం పానకంలో పల్లీలు, పుట్నాలు వేసి ముద్దలుగా తయారు చేసి తినేందుకు ఇష్టపడేవారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తే తల్లులు సంతోషిస్తారని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సమ్మక్క–-సారలమ్మలకు కిలో లకొద్దీ బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకునే భక్తులు.. గద్దెల నుంచి చిటికెడు బెల్లాన్నయినా ఇంటికి తీసుకెళ్లాలని పోటీ పడతారు. ఇలా చేస్తే  అంతా మంచి జరుగుతుందనే వారి విశ్వాసం.