తిరుమల శ్రీవారికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం ఇచ్చిన భక్తులు

తిరుమల శ్రీవారికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం ఇచ్చిన భక్తులు

దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి రూ. 3 కోట్ల 86 లక్షల స్వర్ణ యజ్ఞోపవీతాన్ని విరాళం సమర్పించారు భక్తులు. బుధవారం ( సెప్టెంబర్ 24 ) విశాఖపట్నానికి చెందిన హిందుస్థాన్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ దువ్వాడ మస్తాన్ రావు, శ్రీమతి కుంకుమ రేఖ దంపతులు రూ.3 కోట్ల 86 లక్షలు విలువచేసే స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి బహుకరించారు. వాజరాలతో పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం 3 కిలోల 860 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు దాతలు కానుకను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు గారికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను అభినందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు చైర్మన్ బీఆర్ నాయుడు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ నరేష్ కుమార్, శ్రీ శాంతారామ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు  దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఒక్కరోజు హాజరయినా చాలు జన్మధన్యమయినట్లే భావిస్తారు..‌ 

ఇక ప్రతిఏటా బ్రహ్మోత్సవాలలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. కళ్యాణ వేదికలో సుమారు 8 నుంచి 10 టన్నుల పుష్పాలతో చేసే పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్డుకుంటోంది.  దాతల సహకారంతో ఈ ఏడాది 18 టన్నుల సంప్రదాయ పుష్పాలతో స్వామి క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. 6 టన్నులతో శ్రీవారి ఆలయంలోపల, మరో 12 టన్నులతో తిరుమలలో పుష్పాలంకరణ చేశారు. ఈ అలంకరణకు రూ. 3.5 కోట్ల విలువైన పూలను ఉపయోగించారు.

 లక్ష కట్‌ ఫ్లవర్స్‌లో ఆలయంలోని ధ్వజస్తంభం ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గరుడసేవ ముందురోజు, మహారథం ముందురోజు ఈ పుష్పాలంకరణలను మార్చనున్నారు. ఈఏడాది ప్రత్యేకంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1, జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద పుష్పాలంకరణలు చేశారు.