
- ఘనపూర్ ఆనకట్టలో అపరిశుభ్రంగా నీరు
- మాఘ అమావాస్య జాతర
- భారీగా తరలిరానున్న భక్తులు
- ఇంకా ఏర్పాట్లు చేయని అధికారులు
మెదక్/పాపన్నపేట, వెలుగు: మాఘ అమావాస్య రోజున నది స్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ రోజు ఎక్కడెక్కడి వారో నది ఒడ్డున ఆలయాలు కొలువై ఉన్న ప్రాంతానికి వెళ్లి నది జలాల్లో స్నానాలు చేసి దేవుడిని దర్శించుకుంటారు. మెదక్ జిల్లాలో ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో మాఘ స్నానాలు చేసేందుకు ఎక్కువ మంది తరలివస్తారు. ఈ క్రమంలో శనివారం మాఘ అమవాస్య రోజున ఏడుపాయలలోని వనదుర్గా భవానీ మాత దర్శనానికి తెలంగాణాలో వివిధ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు.
ఆనకట్టలో మూడు ఫీట్ల నీళ్లే...
ప్రతిసారి మాఘ అమావాస్య జాతర సందర్భంగా ఎగువన సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ఆనకట్టకు నీటిని విడుదల చేస్తారు. ఆనకట్టకు అటు చిన్న ఘనపూర్ వైపు, ఇటు నాగ్సానిపల్లి వైపు ఉన్నగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తే ఏడుపాయల ఆలయ ప్రాంగణంలోని నది పాయలలో నీటి ప్రవాహం పెరిగి భక్తుల మాఘ స్నానాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. కాగా వారం రోజుల కింద యాసంగి పంటల సాగు అవసరాల కోసం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఘనపూర్ ఆనకట్టకు విడుదల చేసినా ఆ నీటిని మహబూబ్ నగర్, ఫతేనగర్ కాల్వలకు వదలడంతో ఆనకట్టలో ప్రస్తుతం మూడు ఫీట్ల మేర మాత్రమే నీటి నిల్వ ఉంది.
విగ్రహాలను తీయలే..
ఈసారి వినాయక, దుర్గమాత విగ్రహాలను ఘనపూర్ ప్రాజెక్టులో నిమజ్జనం చేసి తర్వాత కర్రలు, తదితర వస్తువులు ఇంకా అందులో నుంచి తీయలేదు. విగ్రహాలను కెమికల్స్ ఉపయోగించి తయారు చేయడంతో నీళ్లన్నీ ఆకుపచ్చ కలర్లో కనిపిస్తున్నాయి. గేట్ల ముందు పెద్ద మొత్తంలో చెత్తాచెదారం పేరుకుపోయింది.
అధికారుల తీరుపై విమర్శలు..
మాఘ అమావాస్య సందర్భంగా ప్రస్తుతం అధికారులు ఆనకట్టలో రంగుమారి ఉన్న నీళ్లనే మంజీరా నది పాయలకు విడుదల చేయనున్నారు. ఎంతో భక్తితో పవిత్ర స్నానాలు చేసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయకుండా ఆనకట్టలో ఉన్న అపరిశుభ్రమైన నీటినే విడుదల చేనుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కనీస ఏర్పాట్లు చేయలే..
ప్రస్తుతం మాఘ స్నానాలకు ఒకరోజు గడువు మాత్రమే ఉంది. కానీ ఏడుపాయలలో కనీస ఏర్పాట్లు చేయలేదు. స్నాన ఘట్టాల దగ్గర, ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఏడుపాయలలోని పర్మినెంట్, టెంపరరీ టాయిలెట్ల వద్ద వాటిని వినియోగించుకునేలా ఏర్పాట్లు లేవు. ఈ పరిస్థితితో ఇబ్బందులు తప్పవని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఏ ఇబ్బంది రానివ్వం
మాఘ అమావాస్య జాతర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద క్యూలైన్లు, లడ్డు, పులిహోర కౌంటర్ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశాం. భక్తులు స్నానాలు చేసేందుకు ఘనపూర్ ఆనకట్టలో ఉన్న నీటిని నది పాయలకు వదులుతున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపడుతున్నాం. – బాలాగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్