
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం జనసంద్రంగా మారింది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాధారులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో రెండో రోజైన బుధవారం స్వామివారికి హోమం, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం, అభిషేకము నిర్వహించారు. మధ్యాహ్నం సహస్రనామార్చన, మహా నివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం కుంకుమార్చన, పారాయణం, హోమం జరిపారు.
కొండగట్టుకు చేరుకున్న దీక్షాధారులు ముందుగా కోనేరులో స్నానమాచరించారు. అనంతరం అంజన్నను దర్శించుకొని మాలవిరమణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి భక్తుల రాక పెరగడంతో అందుకు తగ్గట్లుగా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం పడడంతో భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు. గాలివానకారణంగా వై జంక్షన్ నుంచి గుట్టపై వరకు వేసిన టెంట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది.