కరోనాకు కొత్త మందు.. అత్యవసర వినియోగం కోసం అనుమతి

కరోనాకు కొత్త మందు.. అత్యవసర వినియోగం కోసం అనుమతి
  • జైడస్ క్యాడిలా వారి ఔషధం ‘విరాఫిన్’
  • సింగిల్ డోస్.. పెద్దలకు మాత్రమే
  • ఆక్సిజన్ అవసరం తగ్గిస్తుందంటున్న కంపెనీ

న్యూఢిల్లీ: కరోనా కట్టడి చర్యల్లో వేగం పెంచిన కేంద్రం ప్రభుత్వం దేశంలో మరో డ్రగ్ కు అనుమతిచ్చింది. జైడస్ క్యాడిల్లా తయారు చేసిన విరాఫిన్ యాంటీ వైరల్ డ్రగ్ అత్యవసర వాడకానికి అప్రూవల్ ఇచ్చింది డీసీజీఐ (DCGI). కరోనా రోగుల్లో మధ్యస్తంగా లక్షణాలు ఉన్నవారికి విరాఫిన్ బాగా పనిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. పేషెంట్లలో ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుందని వివరించింది. విరాఫిన్ ను పెద్దలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. సింగిల్ డోస్ విరాఫిన్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. దేశంలోని 20 నుంచి 25 చోట్ల విరాఫిన్ ట్రయల్స్ నిర్వహించగా మంచి ఫలితాలు వచ్చాయని కంపెనీ ప్రకటించింది. సప్లిమెంటల్ ఆక్సిజన్ అందించాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని ప్రూవ్ అయినట్టు జైడస్ క్యాడిల్లా సంస్థ పేర్కొంది. 
సరైన సమయంలోనే అనుమతి
విరాఫిన్ ఔషధానికి సరైన సమయంలోనే అనుమతి వచ్చిందని జైడస్ క్యాడిల్లా సంస్థ తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ అవసరం బాగా పెరిగింది. చాలా మంది పేషెంట్లు ఆక్సిజన్  అందక చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించే రెమ్ డెసివిర్ మందుకు కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరాన్ని తగ్గించే విరాఫిన్ వినియోగంలోకి రానుండడం మంచి పరిణామం అన్నారు క్యాడిల్లా హెల్త్ కేర్ ఎండీ శ్రవిల్ పటేల్. ఒక పేషెంట్ కు రెమ్ డెసివిర్ ఇస్తే దానిని అనేక డోసులు వాడాల్సి ఉంటుంది. అదే విరాఫిన్ మాత్రం సింగిల్ డోస్ సరిపోతుందని కంపెనీ తెలిపింది.