- ఆదిలాబాద్‌లో మాజీ మావోయిస్ట్, పోలీస్ అమరవీరులకు ఇండ్ల స్థలాలు పంపిణీ
ఆదిలాబాద్, వెలుగు : ఆదివాసీలు ఉన్నత స్థానాలకు ఎదగాలని, గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలవాలని డీజీపీ శివధర్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల మహాజన్, ఐజీ గజరావు భూపాల్‌తో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రూరల్ మండలంలోని చించుఘాట్‌లో ఆదివాసీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ‘పోలీసు మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆదివాసీలకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.
అనంతరం గతంలో చనిపోయిన ఎస్సై శివాజీ, కానిస్టేబుల్ రమణారెడ్డి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామకపత్రాలు, కానిస్టేబుళ్లు జె. ముకుందరావు భార్య విమలకు ఇంటి స్థలం, కానిస్టేబుల్ ఆర్.దిగంబర్ కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. అలాగే లొంగిపోయిన మావోయిస్టులు బోథ్ దళానికి చెందిన కొమరం సుశీల, కుమరం సక్కుబాయికి ఇంటి స్థలాలు అందజేశారు.
అనంతరం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పార్క్ ఓపెన్ చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 490 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అలాగే క్యూఆర్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్న 500 ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజచేశారు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్‌లో సర్పంచ్‌లు, రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని 36 గ్రామపంచాయతీలు స్వచ్ఛందంగా తీర్మానాలు చేసి డీజీపీకి అందించారు. అనంతరం పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ జ్వాలా ముగింపు, ఖాకీ కిడ్స్, వాహనాలు నడిపిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.
మాజీ మావోయిస్టులతో డీజీపీ సమావేశం
లొంగిపోయిన మావోయిస్టులతో డీజీపీ శివధర్‌రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హింసా మార్గాన్ని వీడి సమాజంలో కలిసిన మావోయిస్టులు సాధారణ జీవితం గడపడం సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వం అందజేస్తున్న పునరావాస పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇంటి స్థలాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థికసాయం, విద్యా సదుపాయాల వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎలాంటి వైద్య సదుపాయం అవసరమైనా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

