
- ‘వీ6 వెలుగు’ ఎఫెక్ట్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని మల్టీపర్పస్ పార్కులో అక్రమంగా ఏర్పాటు చేసిన దాబాను ఎట్టకేలకు బల్దియా ఆఫీసర్లు క్లోజ్ చేయించారు. పార్కులో నిబంధనలకు విరుద్ధంగా దాబా ఏర్పాటు చేయడంతోపాటు పార్కులో కాంట్రాక్ట్ ఏజెన్సీ అక్రమ వసూళ్ల దందాపై ‘వీ6 వెలుగు’లో వరుస స్టోరీలు పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాబా వ్యవహారంపై కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్ కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ వేణు, ఏఈ సతీశ్, టీపీబీవో నవీన్ బృందం విచారణ జరిపారు.
తొలుత సోమవారం రాత్రే బల్దియా సిబ్బంది బోర్డులు తొలగించి.. రూ.25 వేలు ఫైన్ విధించి దాబాను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మంగళ, బుధవారాల్లోనూ తెరిచారు. తమకు క్యాంటీన్ పర్మిషన్ ఉందని, దాబా పెట్టుకోవచ్చని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై బుధవారం ‘వెలుగు’లో స్టోరీ పబ్లిష్ అయింది. ఈ నేపథ్యంలోనే కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం ఎట్టకేలకు దాబాను మూసివేసి, గేటుకు తాళం వేశారు. కాగా పార్కులో అధిక ఫీజుల వసూళ్లు, పార్కింగ్ వ్యవహారంపై మాత్రం బల్దియా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.