Diwali 2023: ఈ పండక్కి బంగారం కొంటున్నారా.. ఈ 8 అంశాలు కచ్చితంగా తెలుసుకోండి

Diwali 2023: ఈ పండక్కి బంగారం కొంటున్నారా.. ఈ 8 అంశాలు కచ్చితంగా తెలుసుకోండి

బంగారం అనేది ఇప్పుడొక ఇన్వెస్ట్ మెంట్ వనరు.  ప్రస్తుత రోజుల్లో బంగారం విలువ రోజు రోజుకు పెరిగిపోతుంది.    బంగారం కొంటే ఆర్థికంగా అభివృద్ది చెండడమే. గోల్డ్ కొనడం కూడా ప్రస్తుతం ఒక రకంగా వ్యాపారమే అని చెప్పుకోవచ్చు.  అయితే దీపావళి పండుగ ముందు వచ్చే దంతేరాస్ (ధనత్రయోదశి) రోజున ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి.  అంతేకాదు ధన త్రయోదశి రోజున ఎంత బంగారం కొంటే ,, వచ్చే ఏడాదికి అది కాస్త రెండు పెరుగుతుందని హిందూ భక్తులు భావిస్తుంటారు.  ఈ ఏడాది దంతేరాస్ పండుగ( ధనత్రయోదశి) నవంబర్ 10 శుక్రవారం వచ్చింది.  అయితే బంగారం కొనేముందు తొందరపడకుండా  కీలకమైన  అంశాలను పరిశీలించాలి.  ఇప్పుడు అవేంటో ఒకసారి తెలుసుకుందాం. . . . 

బడ్జెట్ ప్లాన్

బంగారంపై పెట్టుబడి పెట్టడం.. ఒక ఒక సాంస్కృతిక సంప్రదాయమే కాదు.. ఈ రోజుల్లో  స్థిరాస్థిని కొనుక్కున్నట్టే.  భూమి విలువ ఎలా పెరుగుతుందో.. బంగారం విలువ కూడా కాలక్రమేణా పెరుగుతుంది.  ఏదైనా కొనేటప్పుడు బడ్జెట్ ప్లాన్ చాలా ముఖ్యమైనది.  ఆర్థిక భారం పడకుండా ఎంతమేరకు బంగారం కొనాలో ముందుగానే నిర్దారించుకోండి. అందమైన ఆభరణాల కోసం అప్పులు చేసి కొని.. అది కాస్త ఎడ్జెస్ట్ అవకపోతే నష్టం రాకపోయినా సంతృప్తి ఉండదు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. 

హాల్ మార్క్ పరిశీలన 

బంగారు ఆభరణాలు వివిధ స్వచ్ఛత స్థాయిలలో లభిస్తాయి, సాధారణంగా క్యారెట్లలో కొలుస్తారు. బంగారం నాణ్యత లేదా స్వచ్ఛతను 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే అది 99.99 శాతం స్వచ్ఛమైదని అర్థం. ఇందులో స్వల్ప మోతాదులో ఇతర లోహాలుంటాయి. 24 క్యారెట్ల బంగారం సున్నితంగా ఉండటంతో దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. దీనికి గట్టిదనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత అంటే 22 క్యారెట్లు, 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహాలు ఉంటాయి. అలాగే 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం, ఇతర లోహాలు 25 శాతం ఉన్నాయని అర్థం. 14 క్యారెట్లలో బంగారం 58.5 శాతం, 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. అయితే సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు.  అయితే బంగారం కొనేముందు నాణ్యతను ధృవీకరించుకోవడానికి ల్‌మార్క్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.

షాపును ఎంచుకోవడంలో...

బంగారం కొనుగోలు చేసేటప్పుడు నగల వ్యాపారిని.. జ్యూయలరీ షాపును ఎన్నుకోవడం కూడా చాలా అవసరం. మీకు బాగా తెలిసిన షాపులో తీసుకోండి.  అయితే ఆ షాపు గురించి ముందుగా మీరు విచారించండి.  లేకపోతే ఇంటర్ నెట్ లో బంగారం షాపులను పరిశీలించండి.  మంచి పేరు.. పెద్ద పెద్ద నగల వ్యాపారులు కొంచెం రేటు తగ్గించే అవకాశం ఉంటుంది.   

హాల్‌మార్క్ సర్టిఫికేషన్

విలువైన వస్తువులు కొనేటప్పుడు ధృవీకరణ పత్రాలు అవసరం.  భూములు కొనేటప్పుడు ఎలాగైతే సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం నుంచి దస్తావేజులు పొందుతామో... అలాగే బంగారం కొనేటప్పుడు లోహం నాణ్యత గురించి తెలియజేసే సర్టిఫికెట్ అవసరం.  దీనినే హాల్ మార్క్ సర్టిఫికేషన్  అంటారు.  దీనినిబ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) భారతదేశంలో బంగారాన్ని ధృవీకరిస్తుంది.  మీరు చెల్లించిన డబ్బుకు అంతకు విలువగల నాణ్యమైన బంగారం ఉన్నదో లేదో ఈ ధృవీకరణ పత్రంలో నమోదు చేస్తారు.

మార్కెట్ రేట్లు

ప్రస్తుతం గోల్డ్ ధరలు ఏరోజు కారోజు మారుతున్నాయి.  అయితే బంగారం కొనాలనుకున్నప్పుడు రేటు తగ్గిన రోజు తీసుకోవడం మంచిది. మీరు కొనేరోజు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి.  నగల వ్యాపారితో చర్చించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే బంగారాన్ని కొనండి. 

ఆభరణాల మేకింగ్ ఛార్జీ

ఆభరణాలను తయారు చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారీ చార్జీలు వసూలు చేస్తుంటారు.  వేర్వేరు షాపుల్లో వేర్వేరుగా మేకింగ్ కాస్ట్ ఉంటుంది.  
స్వర్ణకారుడు తయారు చేసినా, నేరుగా దుకాణాల్లో కొన్నా 10 గ్రాములకు 400 మిల్లీ గ్రాములు తరుగు, మజూరీకి పోతుంది. అయితే మోసం జరిగే అవకాశం మాత్రం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలోనే ఉంటుంది.ఆభరణంలో అద్దిన రాళ్ల (స్టోన్స్) బరువును సైతం బంగారంగా చూపిస్తారు. అందులోనూ ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుంది. అది గ్రహించకపోతే మోసం తప్పదు. స్టోన్స్‌తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములుంటే అందులో ఐదు గ్రాములు స్టోన్స్ ఉంటే, రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఉంటుంది.

ఆ రాళ్లను బంగారంలా లెక్కించి, తరుగు ధర, మేకింగ్ ఛార్జెజ్ ఉండవని, లేదా చాలా తక్కువ తరుగు, తయారీ ధరలంటూ తగ్గించి... మార్కెటింగ్ చేసుకుంటారు. రాళ్లలో మిగిలిన దాంతో పోల్చుకుంటే ఇచ్చే ఆఫర్లు పెద్దగా ఏమీ ఉండవు. బంగారు ఆభరణాల్లో పొదిగే రాళ్లు ఖరీదు రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.2000 వరకు ఉంటాయి. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్ చాలా నష్టపోతారు. అదే తరుగు, తయారీ ఛార్జీలు లేవనే ఆఫర్లు గట్టి గాజులు, గట్టి ఉంగారాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో ఇవ్వరు. ఇవ్వలేరు.

చెల్లింపు పద్ధతి

ఒక్కోసారి బంగారం షాపుల వారు స్కీంలు పెడుతుంటారు.  వాయిదాల ( EMI) పద్దతిపై డబ్బులు కడుతుంటారు. కొంతమంది అదనపు చార్జీ వసూలు చేస్తుంటారు. అయితే మొత్తం ఒకేసారి చెల్లిస్తే కొంతమేరకు తగ్గిస్తారు. అయితే ఈ విషయంలో మీరు ఎంత బంగారం కొంటున్నారు.. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో చూసుకొని  తీసుకోండి.

బిల్ తీసుకోండి

మీరు ఏ వస్తువు కొన్నా బిల్ తీసుకున్నా.. తీసుకోకపోయినా... బంగారం వస్తువులు కాని.. బంగారం కాని కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోండి.  ఇందులో మీరు మీవద్ద ఉన్న పాత బంగారం ఇచ్చి కొత్త వస్తువు తీసుకొంటే.. పాత బంగారం ఎంత ఉంది... దానిలో ఎంత తరుగు తీశారు.. అందులో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా.. దాని విలువ ఎంత.. ఎన్ని క్యారట్లు.. దానికి ఎంత డబ్బులు వచ్చాయి.. ఇప్పుడు కొన్న బంగారం విలువ ఎంత.. మజూరీ ఛార్జీ ఎంత.. దానిలో ఉండే స్టోన్స్ బరువు ఎంత .. దీని విలువ ఎంత.. మొదలగు అన్ని వివరాలు బిల్లులో ఉండేలా చూసుకోవాలి.  మీరు భవిష్యత్తులో బంగారాన్ని మార్చి వేరే వస్తువు తీసుకొనేటప్పుడు ఈ బిల్ కీలకంగా మారుతుంది.