Kalam Biopic: ఆఫిషియల్.. ‘ఆదిపురుష్’తర్వాత ‘కలాం’బయోపిక్తో ఓం రౌత్ సాహసం.. హీరో ఎవరంటే?

Kalam Biopic: ఆఫిషియల్.. ‘ఆదిపురుష్’తర్వాత ‘కలాం’బయోపిక్తో ఓం రౌత్ సాహసం.. హీరో ఎవరంటే?

ఆదిపురుష్ డైరెక్టర్‌ ఓం రౌత్ మరో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశాడు. ప్రభాస్తో ఆదిపురుష్ తెరకెక్కించిన రెండేళ్ల తర్వాత తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం బయోపిక్ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు.

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన అబ్దుల్ కలాం పాత్రలో స్టార్ హీరో ధనుష్ నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు ‘కలాం’అనే టైటిల్ పెట్టారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్‌లైన్. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్లో కలాం పాత్రలో ధనుష్ కనిపించగా.. మిస్సైల్ గాల్లోకి దూసుకెళ్లడం అద్భుతంగా ఉంది. 

"రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు, ఒక లెజెండ్ ప్రయాణం ప్రారంభమవుతుంది...భారతదేశ మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి వస్తున్నాడు. పెద్ద కలలు కనండి. ఉన్నత స్థాయికి ఎదగండి" అని క్యాప్షన్తో ఓం రౌత్ వివరాలు వెల్లడించారు. 

ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లో నటిస్తుండటం ధనుష్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "ఇంత స్ఫూర్తిదాయకమైన మరియు గొప్ప నాయకుడు - మన స్వంత డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం సర్ జీవితాన్ని చిత్రీకరించడం నాకు నిజంగా ఆశీర్వాదంగా మరియు చాలా వినయంగా అనిపిస్తుంది" అని నోట్ లో రాశారు. 

తన్హాజీ, ఆదిపురుష్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ఓం రౌత్ తన మూడో ప్రాజెక్ట్ తో సాహసం చేస్తున్నాడు. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వంటి మహాన్నోత వ్యక్తి బయోపిక్ ను టచ్ చేసి పెద్ద సాహసమే చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాలను డైరెక్టర్‌ ఓం రౌత్ ప్రస్తావించనున్నారు. కలాం శాస్త్రవేత్తగా ఎదిగిన విధానం, భారత అంతరిక్ష పరిశోధనా, రక్షణ పరిశోధన రంగాలను అభివృద్ధి దిశలో నడిపిన తీరును కళ్ళకు కట్టినట్లుగా చూపించనున్నారు. మరి ధనుష్ ను ఓం రౌత్ ఎలా చూపించనున్నాడనేది ఆసక్తి నెలకొంది.