శభాష్ ధనుష్ శ్రీకాంత్

శభాష్ ధనుష్ శ్రీకాంత్

ధనుష్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌. తెలంగాణ వర్థమాన షూటర్‌‌‌‌. పుట్టుకతోనే అతనికి  చెవుడు. ఎవరేం చెప్పినా వినిపించదు. కానీ, అతడి గన్‌‌‌‌ నుంచి దూసుకొచ్చే బుల్లెట్‌‌‌‌ సౌండ్‌‌‌‌ మాత్రం సాలిడ్‌‌‌‌గా ఉంటుంది. ఎందుకంటే టార్గెట్‌‌‌‌ను గురి చూసి కొట్టడంలో.. మెడల్స్‌‌‌‌ కొల్లగొట్టడంలో అతను దిట్ట. కొద్ది నెలల కిందట ఖేలో ఇండియా అండర్‌‌‌‌–21 గేమ్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గి తన టాలెంట్‌‌‌‌ దేశం మొత్తం తెలిసేలా చేశాడు.  తాను వినలేకపోయినా.. తన పేరు షూటింగ్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌లో మార్మోగేలా చేస్తూ..  ఇప్పుడు  నేషనల్‌‌‌‌ లెవెల్‌‌‌‌లో రెగ్యులర్‌‌‌‌ కేటగిరీలో పతకం గెలిచిన తొలి బధిర షూటర్‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. ప్రస్తుతం సీనియర్‌‌‌‌, జూనియర్‌‌‌‌ లెవెల్స్‌‌‌‌లో  వరల్డ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ కంటే మెరుగైన స్కోరు చేసి ఔరా అనిపించాడు. ఢిల్లీలో జరుగుతున్న కుమార్‌‌‌‌ సురేంద్ర మెమోరియల్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ ధనుష్‌‌‌‌  మెరుపులకు వేదికైంది. ఈ టోర్నీలో అతను ఒక గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచాడు.  జూనియర్‌‌‌‌ (అండర్‌‌‌‌-21) కేటగిరీ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ ఫైనల్లో  ధనుష్‌‌‌‌ 252.5 స్కోరుతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచి స్వర్ణం కైసవం చేసుకున్నాడు. రష్యా షూటర్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌ డ్రైయగిన్‌‌‌‌  నమోదు చేసిన సీనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డు స్కోరు 251.2, చైనాకు చెందిన యుయెఫెంగ్‌‌‌‌ వాంగ్‌‌‌‌ పేరు మీదున్న  జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డు స్కోరు 252.2 కంటే కూడా ధనుష్‌‌‌‌ మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌ చేయడం విశేషం. మంగళవారం జరిగిన పోటీల్లో హైదరాబాదీ  సీనియర్‌‌‌‌, జూనియర్‌‌‌‌ (అండర్‌‌‌‌–21), యూత్‌‌‌‌ (అండర్‌‌‌‌–18) విభాగాల్లో ఫైనల్స్‌‌‌‌కు అర్హత  సాధించాడు. సీనియర్‌‌‌‌ ఫైనల్లో ఏడో ప్లేస్‌‌‌‌లో నిలిచిన తర్వాత..  అండర్‌‌‌‌–21 ఫైనల్లో గోల్డ్‌‌‌‌ కొట్టి, అండర్‌‌‌‌–18 కేటగిరీలో250.6 స్కోరుతో  రజతం సాధించాడు. అండర్‌‌‌‌–21 విభాగంలో 24 షాట్ల ఫైనల్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో ధనుష్‌‌‌‌ ఒక్కసారి కూడా 10.2 కంటే తక్కువ స్కోరు చేయకపోవడం గమనార్హం. ఏషియన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ కాంస్య పతక విజేత ఐశ్వర్య ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌నూ ఓడించాడు. ప్రతాప్‌‌‌‌ కూడా 251.9 స్కోరుతో  సీనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డు కంటే ఎక్కువ స్కోరు చేసినా ధనుష్‌‌‌‌ను అందుకోలేక సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తోనే సరిపెట్టుకున్నాడు.  వెటరన్‌‌‌‌ షూటర్‌‌‌‌ గగన్‌‌‌‌ నారంగ్‌‌‌‌ ‘గన్‌‌‌‌ ఫర్‌‌‌‌ గ్లోరీ’ అకాడమీలో ధనుష్‌‌‌‌ శిక్షణ తీసుకుంటున్నాడు.  ధనుష్‌‌‌‌కు మెంటార్‌‌‌‌ గగన్‌‌‌‌ అతనిలో చాలా ప్రతిభ ఉన్నదని అంటున్నాడు. ‘ధనుష్‌‌‌‌లో అద్భుతమైన టాలెంట్‌‌‌‌ ఉంది. నిలకడగా పెద్ద స్కోర్లు నమోదు చేయడం అంత ఈజీ కాదు. కానీ, ఒత్తిడిని ఎదుర్కోవడానికి అలవాటు పడడం వల్ల మెరుగైన స్కోరు సాధిస్తున్నాడు. అతనికి ట్రైనింగ్‌‌‌‌ ఇచ్చేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. అయితే, 16 ఏళ్ల కుర్రాడి నుంచి ఇలాంటి ఫలితాలు చూస్తుంటే  మాలో కూడా ఉత్సాహం పెరుగుతోంది’ అని నారంగ్‌‌‌‌ చెబుతున్నాడు.