రైతు బతుకుపై ధరణి నిప్పులు

రైతు బతుకుపై ధరణి నిప్పులు

తెలంగాణ రాష్ట్ర సాధన సకలజనుల పోరాట ఫలితం. తెలంగాణ పునర్నిర్మాణంలో మాత్రం సమిష్టి భాగస్వామ్యం లేకపోవడం అనేక చర్చలకు దారితీస్తుంది. తొమ్మిదేండ్ల తెలంగాణ కాలాన్ని పాలకులు దశాబ్ది ఉత్సవాలుగా నిర్వహిస్తున్నారు. త్వరలో ఎన్నికలు ఉండడంతో పాలక పక్షాల ఉత్సవాలైనా, విమర్శలైనా పాక్షిక సత్యాలుగానే ఉంటాయనడంలో సందేహం లేదు. ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా ప్రజా కోణంలో, ప్రజాప్రతిపక్షంగా తొమ్మిదేళ్ల తెలంగాణ పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం కొద్దిమందికి నజరానా గాకుండా చూసుకోవాలె.

నిజాం రాచరిక ఫ్యూడలిస్ట్ కుల వ్యవస్థ సుదీర్ఘ పాలనలో తీవ్రమైన కులవర్గ అణిచివేతకు,  పీడనకు తెలంగాణ గురవుతూ వచ్చింది. అంతే తీవ్ర ప్రతిఘటనలకు, త్యాగాలకు వెరవని గడ్డగా కూడా ప్రచారం పొందింది. భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి కుల నిర్మూలన పోరాట స్ఫూర్తి, భూమి కోసం- భుక్తి కోసం విముక్తి కోసం ఐదేండ్లపాటు (1946–51) సాగిన చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, 1952లో సాగిన ముల్కీ పోరాటం, 1969 ప్రత్యేక తెలంగాణ తొలి దశ పోరాటం, నక్సల్బరీ ప్రేరణతో సాగిన విప్లవ పోరాటాలు, మేమెంతో మాకు అంత వాటా అంటూ సాగిన సామాజిక న్యాయ ఉద్యమాలు మద్యపాన వ్యతిరేక, స్త్రీ విముక్తి ఉద్యమాలు, విద్యార్థుల రిజర్వేషన్ల హక్కుల పోరాటాలు ఇందులో ముఖ్యమైనవి. ఈ పోరాటాల ప్రేరణతో అంతర్గత వలస పాలన నుంచి విముక్తి కోసం మలిదశ తెలంగాణ పోరాటం సాగింది. 

వేల సభల్లో ఆడి పాడాం

1995లో ‘తెలంగాణం’ అనే పాటల క్యాసెట్టు, పాటల పుస్తకాన్ని అరుణోదయ ప్రచురించింది. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటై ముందుకి రాకముందే భావవ్యాప్తి ప్రచారోద్యమం సాగింది. తెలంగాణ కోసం ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు. “పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే పాలమూరులోన / మన తెలంగాణలోనా" అంటూ 1995లో మిత్ర రాసిన పాటలోనే ‘‘పల్లె పల్లెనా పచ్చదనముకై పాలమూరు కెళ్దాం / దగాపడ్డ మన తెలంగాణకై సంఘమొకటి వెడుదాం / సంగతేందో చూద్దాం” అంటూ పిలుపు కూడా ఉంది. ఈ పాట మొదలు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని తలకెత్తుకుని 20 ఏండ్లలో కొన్ని వేల కిలోమీటర్లు పయనించి, కొన్ని వేల సభల్లో ఆడి పాడాము.ఉద్యమానికి పాట అయిన గొంతును నొక్కడానికి సీమాంధ్ర పాలకులు కుట్రతో నాపై ‘నక్సలైటు’ కేసు బనాయించారు.  సీమాంధ్ర పాలకుల కుట్రలను తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు కొనసాగించాలనేది నా ప్రశ్న.

విధ్వంసక అభివృద్ధికి నమూనా

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోడు భూములతో సహా ప్రజల స్వాధీనంలో (అనుభవంలో) ఉన్న భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని.. ఖాళీ ఉన్న 1.9 లక్షల పోస్టులు భర్తీ చేయాలని, మిగులు భూములు పేదలకు పంపిణీ చేయాలని, ఖాయిలా పడ్డ కంపెనీలన్నీ తెరిపించాలని, ప్రజా ఉద్యమాలపై ఆంక్షలన్నీ ఎత్తివేయాలని.. ఇలా అనేక అంశాలను లేవనెత్తం. అయితే బీఆర్​ఎస్ ప్రభుత్వ పాలనలో విధ్వంసకర అభివృద్ధి నమూనాకు ప్రయోగశాలగా తెలంగాణ మారింది. నక్సలైట్ ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించుకొని తొమ్మిదేండ్ల పాలన ముగిసి త్వరలో ఎన్నికల ముందు పోడు భూములకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకుందీ ప్రభుత్వం. కానీ దళితులకు మూడెకరాల భూమి అటకెక్కింది. అనుభవదారుడి పట్టిక ఎత్తేసి దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల బతుకులపై ధరణి నిప్పులు చల్లింది. వారి భూములన్ని మళ్లీ భూస్వాముల పరం అయినాయి. తప్పుల కుప్పగా మారిన దానితో లక్షల మంది రైతులు అవస్థలు పడుతున్నరు. ప్రభుత్వం చేసిన తప్పుల సవరణకు వారు చార్జీలు కడుతూ సవరణల కోసం ఆఫీసుల చుట్టూ తీరుగుతున్నరు. కౌలు రైతులకు ఎలాంటి రక్షిత హక్కులు దొరక్క అప్పులు పుట్టక ఆత్మహత్యలు నిత్యం వారి జీవితంలో భాగమైపోయాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు భూములు అమ్ముకుంటున్నరు. భూమిని రియల్ ఎస్టేట్ సరుకుగా మార్చిన నయాపెత్తందారీ వర్గం ఫామ్ హౌస్ కోటలను నిర్మించడం ఈ కాలంలో పెరిగిపోయింది. కేంద్రీకృత రాజకీయాధికారాలు ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమైనవి. పాలనలో పారదర్శకత లోపించినప్పుడు ప్రశ్నలు, ఆందోళనలు సహజంగా ఉత్పన్నమవుతాయి.

- విమలక్క, ప్రజా గాయని