నేటి ప్రపంచం..ఒక యుద్ధరంగం!

నేటి ప్రపంచం..ఒక యుద్ధరంగం!

‘మనిషి అంతులేని కోరికలే..  దు:ఖానికి మూల కారణాలు’ అని గౌతమ బుద్ధుడు ప్రాచీన కాలంలో బోధిస్తే.. నేటి ఆధునిక కాలంలో అదే మనిషి విపరీత ధోరణులే  వినాశకాలుగా మారాయి. చరిత్రలో యుద్ధాలు కొత్తకాదు. 20వ శతాబ్ది తొలి నాళ్లలోనే  రెండు దశాబ్దాల్లోనే  రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఇక 21వ శతాబ్దిలో మిలీనియం యుగానికి వస్తే మూడో ప్రపంచ యుద్ధం రాదని చెప్పలేం. 

ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్,  ఇజ్రాయెల్– ఇరాన్– అమెరికా, చైనా– తైవాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులను చూస్తే.. మూడో ప్రపంచ యుద్ధం ఆందోళన అంతర్జాతీయ సమాజాన్ని వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లోని నెలకొన్న యుద్ధాల పరిస్థితులను బట్టి చూస్తుంటే ఒకవిధంగా వరల్డ్ వార్ 3.0 స్టార్ట్ అయిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది.


నేటి సాంకేతిక కాలంలో విప్లవాత్మక మార్పులతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది.  అధునాతన యుద్ధరంగంగానూ తయారైంది.  దేశాల మధ్య యుద్ధ నీతులు,  యుద్ధరీతులూ మార్పు చెందాయి.  తమ ప్రజల కనీస జీవన అవసరాలు తీర్చలేని దేశాలు కూడా దేశ  సౌర్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, సమగ్రతకు, శాంతి భద్రతలకు ఆయుధాలను సమకూర్చుకోవాల్సిన, తయారు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ దేశ బడ్జెట్​లోనైనా ఎక్కువగా నిధులు కేటాయింపు రక్షణ రంగానికి, ఆయుధాల దిగుమతికే  వెచ్చిస్తుంటాయి.  

మరోవైపు అభివృద్ధి చెందిన దేశాలు అపారమైన అవకాశాలకు, సరికొత్త టెక్నాలజీ తయారీతోపాటు మానవ వనరులకు కీలకంగా ఉంటే.. ఇంకోవైపు అభివృద్ధి చెందుతోన్న దేశాలు, వెనకబడిన దేశాలూ ఆర్థిక, అసమానతల సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి.  అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆయుధాలు, టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నాయి.  

ఇప్పటికే  రెండు ప్రపంచ యుద్ధాలు 

ఇప్పటికే  రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి.  మొదటిది 1914–19లో.. అనంతరం రెండోది 1939–45 లో వచ్చాయి.  వీటి మధ్య రెండు దశాబ్దాల తేడానే ఉంది.  ఇప్పుడు తొలి యుద్ధానికి 107 ఏండ్లు కాగా.. రెండోది 80 ఏండ్లు పూర్తి చేసుకుంది.  ఇవి  రెండూ  ప్రపంచ రాజకీయాలను, దేశాల సరిహద్దులనూ మార్చేశాయి. అణుబాంబుల పరీక్షలు, వాడకం చేపట్టాయి. ఇందుకు ఉదాహరణగా చూస్తే.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై అమెరికా రెండు అణుబాంబులను వేసింది.  తొలి ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్​లో మరో యుద్ధం రావొద్దనే ముందుచూపుతో ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ అట్లాంటిక్ చార్టర్ ద్వారా ‘నానాజాతి సమితి’  అంతర్జాతీయ సంస్థకు ప్రాణం పోశారు. 

ఇప్పుడు అదే అమెరికా ప్రపంచ రక్షణ, శాంతిస్థాపన కోసమని దేశాల మధ్య వివాదాలు, యుద్ధాలు తలెత్తితే.. ఆయుధాలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ.. ఒప్పందాలతో లొంగదీసుకునే స్థాయికి ఎదిగింది. ప్రపంచ దేశాల్లో జరిగే ఆయుధ వ్యాపారంలో అత్యధిక వాటాను కూడా  ఆక్రమించింది.. రెండో ప్రపంచ యుద్ధాన్ని నానాజాతి సమితి ఆపలేకపోయింది. అనంతరం నానాజాతి సమితి కాస్త ‘ఐక్యరాజ్యసమితి’గా మార్పు చెందింది. అదే పేరుతో నేటికీ కొనసాగుతోంది. ఇక దేశాల మధ్య తలెత్తే యుద్ధ ఉద్రిక్తతలను, యుద్ధాలను నివారించడంలో ఐక్యరాజ్య సమితి కంటితుడుపు చర్యలనే తీసుకుంటోంది. 

అగ్రదేశాల ఆయుధ వ్యాపారం

ఇక మూడో ప్రపంచ యుద్ధాన్ని ఏదేశమూ కోరుకోవడంలేదు. కానీ  అదే అనివార్యమైతే.. ఇంతకుముందెన్నడూ చూడని విపత్కర పరిస్థితులను అంతర్జాతీయ దేశాలు ఎదుర్కోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడు ప్రతి దేశం, అది చిన్నదైనా, పెద్దదైనా ఎంతో శక్తిమంతమైన అణ్వస్త్ర ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి.  వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తయారు చేసుకుంటున్నాయి.  

దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాల వద్ద అణ్వస్త్ర ఆయుధాలు ఉన్నాయి. పొరపాటున ఏ ఒక్క దేశంలో  ఏదైనా తప్పు జరిగినా  అంతర్జాతీయంగా విధ్వంసకర పరిస్థితులకు దారితీయవచ్చు.  అభివృద్ధి చెందిన దేశాలు ఆయుధాల తయారీకి విపరీతమై న ప్రాధాన్యతను ఇస్తూ.. టెక్నాలజీని రూపొందిస్తూ అంతర్జాతీయంగా అమ్ముకునే స్థితికి చేరాయి. ఇప్పటికే అణు వార్,  బయోవార్,  సైబర్ వార్ దాటిపోగా..  స్పేస్ వార్ స్థాయికి కొన్ని దేశాలు ఎదిగాయి.   

పశ్చిమాసియా కేంద్రంగా..?

గత రెండు ప్రపంచ యుద్ధాలు యూరప్ ఖండం కేంద్రంగా మొదలై, ప్రపంచ యుద్ధాలుగా మారాయి. ప్రస్తుతం ఆసియాలో పశ్చిమాన/ పశ్చిమాసియా కేంద్రంగా ఇజ్రాయెల్ – ఇరాన్ దేశల మధ్య తలెత్తిన యుద్ధం మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిందనే..? ఆందోళన మిగతా ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఇప్పటికే  మూడున్నరేండ్ల నుంచి ముగింపు లేకుండా రష్యా, -ఉక్రెయిన్ వార్ కొనసాగుతోంది. 

ఇప్పుడు పాలస్తీనా, గాజా, హమాస్ లతో ఇజ్రాయెల్  మధ్య జరిగే యుద్ధంలోకి ఇరాన్ ఎంట్రీతో ఎన్నెన్నో మలుపులు తిరిగింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధ రంగంలోకి దిగి ఇరాన్ పై వైమానిక క్షిపణి దాడులు చేయడంతో అదికాస్త తీవ్రస్థాయికి చేరింది.  యుద్ధాల ద్వారా దేశాల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తుతాయి.   ప్రపంచ
శాంతి పరిఢవిల్లేందుకు శాంతియుత సంప్రదింపులు, సహకారం ద్వారా యుద్ధాలను నివారించడం ఉత్తమ మార్గం.

ఆయుధాల దిగుమతిలో భారత్  ఫస్ట్..

ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌‌ మొదటి స్థానంలో ఉంది. 2019 నుంచి 2023 వరకు ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్‌‌ వాటా 9.8 శాతం కావడం గమనార్హం.  సౌదీ అరేబియా రెండో స్థానంలో,  పాకిస్తాన్‌‌ ఐదో స్థానంలో ఉన్నాయి. భారత్‌‌కు అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా రష్యా తొలిస్థానం లో ఉంది.  

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని  చాటుకునేందుకు  అత్యత్తమ నావికా దళాలను నిర్వహిస్తున్నా యి. అతిపెద్ద దేశాలు విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాము లు, అధునాతన వాయు నిరోధక రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి . ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా వంటి దేశాలే అంతర్జాతీయంగా ఆయుధ వ్యాపారంలో పోటీపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఆధునిక ప్రపంచం ఒక యుద్ధ రంగంగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 

- వేల్పుల సురేష్,
 సీనియర్ జర్నలిస్ట్​