ధరణి సమస్యల కుప్ప..మార్పులు చేసి మెరుగుపర్చాల్సిందే

ధరణి సమస్యల కుప్ప..మార్పులు చేసి మెరుగుపర్చాల్సిందే
  • రైతుబంధు రాదనడం దుష్ప్రచారం  
  • సమగ్ర భూసర్వే చేయాలె.. కౌలురైతులకు చట్టం తేవాలె
  • తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోలో వక్తల డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఓడిస్తే ధరణి పోర్టల్ రద్దవుతుందని, రైతుబంధు కూడా రాదని సీఎం కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు వక్తలు విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో శనివారం లీఫ్స్ సంస్థ ఆధ్యర్యంలో భూమి ఎజెండా–తెలంగాణ ఎన్నికలు–ప్రజల ఆకాంక్షలు పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు  సునీల్ కుమార్ రూపొందించిన తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోను ఈ సందర్భంగా వక్తలు విడుదల చేశారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలో భూమికి సరైన ప్రాధాన్యత లభించలేదన్నారు. 

ధరణి ద్వారా భూములను ఆన్​లైన్ చేయడం మంచి నిర్ణయమేనని, కానీ దాని ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికోసం లైసెన్సుడు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ కూడా కౌలు రైతులకు ప్రత్యేక చట్టాలను చేయాలని సూచించిందన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి కుంకుమ భరణిలా మారిందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. తెలంగాణలో రాక్షసుల పాలన నడుస్తోందని, దాన్ని అంతం చేయాలన్నారు. 

పౌర సమాజం ద్వారానే ఇది  సాధ్యమవుతుందన్నారు.  ధరణిలో కాస్తు కాలమ్ లేకపోవడంతో అమ్మిన వారి పేరే వస్తోందని, దీంతో రైతుబంధు వారి పేరుమీదే పడుతుందని అడ్వకేట్ సాధిక్ అన్నారు. భూ, అటవీ సమస్యలు తేలనంత కాలం గిరిజన ప్రాంతాల్లో అశాంతి ఉంటుందని వీఎన్​వీకే శాస్త్రి అన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ చీఫ్​ కోదండరాం, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, బీజేపీ నేత వేణుగోపాల్ రెడ్డి, మాజీ రెవెన్యూ ఉద్యోగి సురేశ్, తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యుడు అంబటి నాగయ్య, పద్మ, పి. శంకర్, తదితరులు పాల్గొన్నారు. ​ 

గ్రామసభల్లో పరిష్కరించాలె: కోదండరెడ్డి 

పూర్వం జమాబందీలో రెండు రూపాయలతో భూ సమస్యలు పరిష్కారం అయ్యేవని, ప్రస్తుతం1,500 చెల్లించాల్సిన పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి అన్నారు. గ్రామ సభల ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పటేల్, పట్వారీ వ్యవస్థే నయం అనేలా ఉందన్నారు. ధరణి రద్దు అనేది కాంగ్రెస్ నినాదం కాదన్నారు. భూసమస్య కారణంగా మహిళా తహసీల్దార్ ను ఓ రైతు సజీవ దహనం చేసిన ఘటనను ఆయన గుర్తుచేశారు. కౌలు రైతుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని.. పంటనష్టం, బ్యాంకు రుణాలు ఇవ్వాన్నారు. అసైన్డ్, భూదాన భూములను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆరోపించారు.  

ప్రత్యేక చట్టాలను తీసుకొస్తం:వేణుగోపాల్రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్, వక్ఫ్ భూములను అప్పనంగా అమ్ముకుంటోందని బీజేపీ నేత వేణుగోపాల్రెడ్డి ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని, భూ సమస్య లేకుండా పరిష్కరిస్తామని చెప్పారు. ఎల్లుండి ప్రధాని హైదరాబాద్​కు వస్తారని, ఈ విషయాన్ని ఆయన చేతే చెప్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే సాగు భూములను కాపాడుకోవడానికి ప్రత్యేక చట్టాలను తీసుకొస్తామని, గ్రామస్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.

ధరణిలో లక్షల సమస్యలు పెండింగ్: కోదండరాం

రాష్ట్రంలో ధరణి పోర్టల్ అనేక భూసమస్యలకు కారణమైందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అన్నారు. ధరణిని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దానికి మార్పులు చేసి మెరుగైన వ్యవస్థను తేవాలన్నారు. ధరణిలో 9 లక్షల సాదా బైనామా, 15 లక్షల ప్రొహిబిటెడ్ ల్యాండ్ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ‘‘ధరణిలో సమస్యల పరిష్కారానికి సరైన వ్యవస్థలను తీసుకొస్తాం. పేద రైతుల హక్కులే ధ్యేయంగా పని చేస్తాం.

 కేసీఆర్.. ఇది మా ఎజెండా. మరి మీ ఎజెండా ఏంటీ?” అని కోదండరాం ప్రశ్నించారు. సీసీఎల్ఏ ద్వారా భూ రికార్డుల తాళాన్ని తన చేతిలో పెట్టుకోవడం కోసమే కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారని ఆయన చెప్పారు. ధరణి కారణంగా 76 పాత సమస్యలు, 46 కొత్త  సమస్యలు వచ్చాయన్నారు. ఈ పోర్టల్ వల్లే దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.