ఎవిడెన్స్ లేకుండా సూసైడ్ అని ఎట్లంటరు: ప్రీతి తండ్రి

ఎవిడెన్స్ లేకుండా సూసైడ్ అని ఎట్లంటరు: ప్రీతి తండ్రి

వరంగల్, వెలుగు:  పోలీసుల వద్ద ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా తన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నదని ఎలా చెప్తారని మెడికో ధరావత్ ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ ప్రశ్నించారు. ‘‘ప్రీతి శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు రిపోర్ట్ ఇస్తారు తప్పితే.. ఆమె తనంతట తానే ఇంజక్షన్ తీసుకున్నట్లు చెప్తారా? హత్య కోణంలో ఎంక్వైరీ చేయకుండా.. సూసైడ్ చేసుకునే చనిపోయిందని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పడం సరికాదు” అని వారు అన్నారు. ప్రీతి సూసైడ్ చేసుకునే చనిపోయిందని సీపీ రంగనాథ్ శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పగా.. నరేందర్, పృథ్వీ శనివారం ఉదయం వరంగల్​లో మీడియాతో మాట్లాడుతూ సీపీ ప్రకటనను ఖండించారు. ప్రీతి కేసును హత్య కోణంలో విచారించాలని మట్వాడా పోలీస్ స్టేషన్​లో మరోసారి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్నారు.
సీపీ తమకు మాట ఇచ్చిన ప్రకారం ఎంక్వైరీ చేయడం లేదని, అందుకే తమకు న్యాయం జరగట్లేదన్నారు. ‘‘పోస్టుమార్టం రిపోర్టులో విష పదార్థాల వల్ల ప్రీతి చనిపోయినట్లు ఉంది తప్పితే.. ఆమె ఇంజక్షన్ తీసుకుందని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి? ప్రీతి సూసైడ్‍ చేసుకునేంత పిరికిది కాదు. ఆమె చేతి దగ్గర కట్టుతో పాటు కమిలిపోయి ఉంది. ఎవరో హ్యార్ష్ గా ఇంజక్షన్‍ చేశారని డాక్టర్లు మాట్లాడుకోవడం మేం విన్నాం” అని వారు వెల్లడించారు. 

కేసులో 1 శాతమే ఎంక్వైరీ చేసిన్రు  

బయటి బ్లడ్ నుంచి శాంపిల్స్ తీసుకోవడం వల్లే టాక్సికాలజీ రిపోర్ట్​లో నిల్ అని వచ్చిందని సీపీ చెప్పారని పృథ్వీ వెల్లడించారు. ‘‘మా అక్కకు సర్జరీ చేసిన్రు. ఎక్మా పెట్టిన్రు. డయాలసిస్‍ చేసిన్రు. బ్లడ్‍ ఎక్కించిన్రు. అసలు ఇవన్నీ బతికించడానికి చేసిన్రా? లేదంటే ఎవిడెన్స్ లేకుండా చేసిన్రా? సైఫ్‍ మెయిన్‍ అక్యూజ్డ్అయినప్పటికీ.. హెచ్‍ఓడీ, సూపరింటెండెంట్‍, ప్రిన్సిపాల్‍తో పాటు విక్రమ్‍, అనూష, భార్గవ్‍, శ్రావ్య కూడా ప్రీతిని వేధించారని ఆరోపించారు. హాస్పిటల్ లో అన్నిచోట్లా సీసీ కెమెరాలు పని చేస్తుంటే.. ఆ ఒక్కచోటే ఎందుకు పని చేయట్లేదో చెప్పాలి. పోలీసులు రాకముందే ఎవిడెన్స్ తీసేసి, సీపీని తప్పుదోవ పట్టించి ఉండవచ్చు కదా” అని ప్రశ్నించారు. కేసును 99 శాతం ఛేదించామని సీపీ అంటున్నారని, కానీ వాళ్లు 1 శాతం మాత్రమే ఎంక్వైరీ చేశారన్నారు. తాము ఇచ్చిన ఫోన్ చాట్స్, రికార్డ్​లు తప్పితే కొత్తగా సేకరించిన ఎవిడెన్స్ ఏమీ లేదన్నారు. ప్రీతి కేసులో హత్య కింద చార్జిషీట్ వేయాలన్నారు.   

మాట మార్చిన ప్రీతి తండ్రి 

ప్రీతి మృతిపై అనుమానాలున్నాయని, మరోసారి ఎంక్వైరీ చేయాలన్న ఆమె తండ్రి నరేందర్.. సీపీ రంగనాథ్​ను కలిశాక మాట మార్చారు. కమిషనరేట్​లో సీపీని కలిసిన తర్వాత నరేందర్ మాట్లాడుతూ.. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. తమకు డౌట్స్ ఉంటే సీపీ క్లియర్‍ చేశారని, కొన్ని ఆధారాలు చూపించారని తెలిపారు. ‘‘ప్రీతి తనకు తానుగా ఇంజక్షన్‍ తీసుకోవచ్చు. నరంలో కాకుండా శరీరంలో తీసుకుంటే తీవ్రత నెమ్మదిగా ఉంటుంది. సైఫ్‍ వల్లే ఆమె సూసైడ్​ చేసుకుంది. మరికొందరిని విచారించి ఆధారాలు సేకరించాక చార్జీషీట్‍ వేస్తాం” అని సీపీ చెప్పినట్లు వెల్లడించారు. అయితే, తమకు పోస్టుమార్టం రిపోర్ట్ చూపలేదని, కేసు మొత్తం వివరాలను ఇస్తామన్నారని తెలిపారు.