కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కు వేసినట్టే: ధర్మపురి అరవింద్

కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కు వేసినట్టే: ధర్మపురి అరవింద్

కమిషన్ల కక్కుర్తితో కాళేశ్వరం కడితే.. గోదావరి నదిలో మునిగిపోయిందని..  లక్ష కోట్ల రూపాయలు  గంగలో కలిపాడని కేసీఆర్ పై ఎంపి ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పసుపు రైతులను మోసం చేసిందని.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. బీఆర్ఎస్ కు ఓటు వేసినట్టేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ మెట్ పల్లి మండలం వెల్లుల్ల, జగ్గ సాగర్ గ్రామాలలో  ధర్మపురి అరవింద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు.

 తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటాడని అరవింద్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పెన్షన్లు,  రేషన్ కార్డులు అందిస్తామన్నారు.  బెల్టు షాపులు లేకుండా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు, మహిళలను  కేసీఆర్ మోసం చేశాడని.. 8 పైసలు వడ్డీకి మహిళా రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.  రూ.200 కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. నిరుపేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తామన్నారు.

కేసీఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లు అడగడంతో పనులు చేసేందుకుకాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ అవినీతినిమయంలో మునిగిపోయి.. ప్రజల సంపదను దోచుకుంటున్నారని అరవింద్ ఆరోపించారు.