2023 ఐపీఎల్లో చెన్నై కెప్టెన్ గా ధోని

2023 ఐపీఎల్లో చెన్నై కెప్టెన్ గా ధోని


ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారో  టీమ్ మేనేజ్మెంట్ తేల్చేసింది. టోర్నీకి ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే కెప్టెన్సీపై స్పష్టత ఇచ్చింది.  వచ్చే సీజన్లో  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ వ్యవహరిస్తాడని ప్రకటించింది.  ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. 

కెప్టెన్సీపై  క్లారిటీ.. 
ఐపీఎల్ 2023 సీజన్ కోసం చెన్నై కెప్టెన్సీ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని  ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్ వెల్లడించారు.  ఐపీఎల్ 2023కి కూడా ధోనియే  చెన్నై కెప్టెన్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశారు. ఎంఎస్ ధోనీ విజయవంతమైన ఐపీఎల్ ఆటగాడు, కెప్టెన్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే సీజన్‌లోనూ ధోనీనే కెప్టెన్ అని  సీఎస్కే  సీఈవో కాశీ విశ్వనాథ్ చెప్పడంతో చెన్నై టీమ్ ఫ్యాన్స్, ధోనీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

జడేజాకు బాధ్యతలు..
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు చెన్నె కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడంతో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు.  అయితే జడేజా కెప్టెన్సీలో చెన్నై ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో ఓడిపోయింది. దీంతో మళ్లీ జట్టు పగ్గాలు ధోనీకే అప్పగించారు. ఆ తర్వాత ధోని సారథ్యంలో చెన్నై  ఆడినా..ప్లేఆఫ్ చేరలేకపోయింది. 

వచ్చే సీజన్లో ఆడతానని ధోనీ స్పష్టం
ఐపీఎల్ 2023 నాటికి  ధోనీ రిటైర్ అవుతారంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే 2023 ఐపీఎల్లోనూ ఆడతానని ధోనీ క్లారిటీ ఇచ్చాడు. 2022లో చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం నచ్చలేదని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది మరింత స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతామని చెప్పాడు. చెన్నై వేదికగా మ్యాచ్లు జరగకపోవడం సీఎస్కే అభిమానులను నిరాశకు గురిచేసిందన్నాడు. ఐపీఎల్ 2023లో తాను మైదానంలోకి దిగడం కన్ఫామ్ అని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే చెన్నై కెప్టెన్గా ధోనినే కన్ఫాం చేస్తూ టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది.