సంద్రం అడుగు భాగమే ఓ వజ్రాల ఫ్యాక్టరీ

సంద్రం అడుగు భాగమే ఓ వజ్రాల ఫ్యాక్టరీ

సముద్రం అడుగు భాగమే ఓ వజ్రాల కొండ. ఎలాగో తెలుసా సహజంగా ఆ అడుగు భాగం రీసైకిల్‌‌ కావడం వల్ల వజ్రపు నేలగా మారిందట. కొన్ని వందల ఏళ్ల పాటు జరిగే ఈ ప్రక్రియలో సముద్రం అడుగున ఉన్న నేల క్రమంగా భూమి పైపొర భూపటలం లోపలికి వెళ్లిపోతుందని ఆస్ట్రేలియాలోని మాక్వరీ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. అక్కడి వేడికి పడే ఒత్తిడికి ఈ అవక్షేపాలు వజ్రాలుగా మారుతున్నాయని తెలిపారు.  టెక్టోనిక్ ప్లేట్లు కదిలి ఒక దానిపై మరొకటి వెళ్లినప్పుడు సముద్రం అడుగు భాగం 200 కిలోమీటర్ల లోతుకు పడిపోతుందని వివరించారు.

భూమి లోపల 200 కిలోమీటర్ల లోతులో ఉండే వేడి, ఒత్తిడిని కృత్రిమంగా సృష్టించిన సైంటిస్టులు, వజ్రాల తయారీని అంచనా వేశారు. వజ్రాల లోపల ఇరుక్కుపోయి ఉండే చిన్న చిన్న ఉప్పు కణికలు కూడా సముద్రం నీటి నుంచే వచ్చాయనే వాదన ఉంది. తమ రీసెర్చ్‌‌‌‌లో కూడా ఇదే తేలిందని సైంటిస్టులు వెల్లడించారు. అయితే ప్రాక్టికల్‌‌‌‌గా దీని కోసం ఎలాంటి టెస్టులు చేయలేదని చెప్పారు. భూ పటలం, భూ ప్రావారం మధ్య కార్బన్ మెటీరియల్ తో వజ్రాలు ఏర్పడతాయి. అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కింబర్ లైట్ అనే మాగ్మా వీటిని భూమిపైకి విసురుతుంది. జెమ్ డైమండ్స్ పూర్తి స్థాయిలో కార్బన్ తో తయారవుతాయి. ఫైబర్ డైమండ్స్‌‌‌‌లో కార్బన్‌‌‌‌తో పాటు సోడియం, పొటాషియం తదితర మూలకాల ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. అందుకే వీటిని ఆభరణాలుగా వాడటానికి ఎవరూ ఆసక్తి చూపరు. జెమ్ డైమండ్స్‌‌‌‌తో పోలిస్తే ఫైబర్ డైమండ్స్ వేగంగా తయారవుతాయి. వీటిని డ్రిల్ బిట్స్‌‌‌‌లో వాడుతున్నారు.