నూడుల్స్ ప్యాకెట్లలో రూ.2 కోట్ల డైమండ్స్

నూడుల్స్ ప్యాకెట్లలో రూ.2 కోట్ల డైమండ్స్
  • బాడీ పార్ట్స్, లగేజీ బ్యాగుల్లో 6 కిలోలకుపైగా బంగారం
  • ముంబై ఎయిర్​పోర్టులో పట్టివేత
  • నలుగురు ప్రయాణీకులు అరెస్ట్

ముంబై: నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్, బాడీ పార్ట్స్ లో గోల్డ్ అక్రమంగా ట్రాన్స్​పోర్ట్​ చేస్తుండగా ముంబై ఎయిర్​పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఒక ప్యాసింజర్​ నుంచి రూ.2.20 కోట్ల విలువైన డైమండ్స్, మరో 11 మంది ప్రయాణికుల నుంచి రూ.4.44 కోట్ల విలువైన 6.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. 

లోదుస్తుల్లో గోల్డ్ బార్స్.. 

సోమవారం అర్ధరాత్రి మన దేశానికి చెందిన ఓ ప్యాసింజర్ బ్యాంకాక్​ వెళ్లేందుకు ముంబై ఎయిర్​పోర్టుకు వచ్చాడు. అతడి ట్రాలీ బ్యాగ్​లోని నూడుల్స్ ప్యాకెట్లలో దాచిన వజ్రాలను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కొలంబో నుంచి ముంబైకి వచ్చిన మరో మహిళా ప్యాసింజర్  వద్ద బంగారాన్ని గుర్తించారు. ఆమె లోదుస్తుల్లో దాచిన 321 గ్రాముల గోల్డ్ బార్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు, బ్యాంకాక్, సింగపూర్ నుంచి వచ్చిన మన దేశానికి చెందిన 10 మంది అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు వారిని అడ్డుకుని సోదాలు నిర్వహించారు. ఒకరిద్దరు పురుషనాళంలో, మరొకరు ఒంటికి గోల్డ్ బిస్కెట్లు చుట్టుకుని, ఇంకొకరు లగేజీలో దాచి ఇలా పది మంది ఒక్కో రీతిలో బంగారాన్ని దాచి అక్రమంగా ట్రాన్స్ పోర్టు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి 6 కిలోలకు పైగా బంగారం సీజ్ చేశారు. దాని విలువ రూ.4.04 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.