గంభీర్‌ను పట్టించుకోని సిరాజ్? టీమిండియాలో విభేదాలపై కొత్త చర్చ! 

గంభీర్‌ను పట్టించుకోని సిరాజ్? టీమిండియాలో విభేదాలపై కొత్త చర్చ! 

Mohammed Siraj: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే అనుమానాలకు బలం చేకూర్చేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోచ్ గంభీర్ తన పక్కనుంచి వెళ్తున్న సమయంలో సిరాజ్ కనీసం పలకరించకపోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అసలు వీడియోలో ఏముంది?: 

వైరల్ అవుతున్న ఆ క్లిప్‌లో గంభీర్ నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడే ఉన్న సిరాజ్ ఆయన వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.. ఇద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు లేకపోవడంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా సవ్యంగానే ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, కేవలం ఈ ఒక్క చిన్న క్లిప్ ఆధారంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని నిర్ధారించలేమని క్రీడా పండితులు అంటున్నారు.

కివీస్ సిరీస్‌కు దూరంగా ఉండటమే కారణమా?: 

ఈ వీడియో ఇంతలా చర్చకు దారితీయడానికి ప్రధాన కారణం న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్.. జట్టులో కీలక పేసర్‌గా కొనసాగుతున్న సిరాజ్‌ను వరుసగా రెండు టెస్టుల తుది జట్టు (Playing XI) నుంచి పక్కన పెట్టడం ఇప్పటికే పెద్ద వివాదంగా మారింది. జట్టు కాంబినేషన్, పిచ్ అవసరాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని మేనేజ్‌మెంట్ చెబుతున్నా, ఫ్యాన్స్ మాత్రం గంభీర్ తీరుపై మండిపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఈ వీడియో బయటకు రావడంతో, సిరాజ్‌ను పక్కన పెట్టడం వెనుక ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అసలు ముచ్చటేంది: 

ప్రస్తుతానికి సిరాజ్, గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నట్లు అధికారిక సమాచారం లేదు. తుది జట్టులో చోటు దక్కకపోవడానికి, ఈ వైరల్ వీడియోకు మధ్య సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ ప్రచారానికి తెరపడేలా లేదు.