ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • సీపీఎం లీడర్ల పై కలెక్టర్ శివలింగయ్య అసహనం
  • ఆందోళనకారులను స్టేషన్ కు తరలించిన వైనం
  • కలెక్టర్ తీరు సీపీఎం లీడర్ల ఆగ్రహం

జనగామ, వెలుగు: సమస్యలు చెప్పుకుందామని చాంబర్​కు వెళితే ఫొటోలకు ఫోజులిచ్చేందుకు వచ్చారా? అంటూ జనగామ కలెక్టర్ శివలింగయ్య అవమానించారని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆరోపించారు. కలెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. జనగామ టౌన్​ లోని మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు తమ ఇండ్ల సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్​వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఆ తర్వాత కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే ఓ మైనార్టీ మహిళనుద్దేశించి ఫొటో కోసమే నా దగ్గరికి వచ్చావా? అంటూ కలెక్టర్ అవమానపరిచే విధంగా మాట్లాడారని కనకా రెడ్డి ఆరోపించారు. శివలింగయ్య కలెక్టర్​ గా జనగామలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కనుసైగల్లో పనిచేస్తున్నాడని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. గత ప్రభుత్వం 1147మందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేసినా, ఇప్పటివరకు స్థలం చూపలేదన్నారు. అనేక సార్లు వినతుల రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకువస్తే పట్టించుకోని కలెక్టర్.. లబ్ధిదారులైన మహిళల పై అవహేళనగా మాట్లాడడం తగదన్నారు. ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న లబ్ధిదారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు.

గుట్టుగా గంజాయి స్మగ్లింగ్‍

వరంగల్‍/నర్సంపేట, వెలుగు: గుట్టుగా గంజాయి స్మగ్లింగ్‍ చేస్తున్న ముఠాను వరంగల్‍ టాస్క్​ఫోర్స్​ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీపీ తరుణ్‍జోషి, టాస్క్​ఫోర్స్​అడిషనల్‍ డీసీపీ వైభవ్‍ గైక్వాడ్‍ వివరాల ప్రకారం.. వరంగల్‍ జిల్లా రాయపర్తికి చెందిన నరసింహారావు, బూర్గంపహాడ్‍కు చెందిన కన్నబోయిన దుర్గాప్రసాద్‍ కలిసి నాలుగేండ్లుగా గంజాయి స్మగ్లింగ్‍ చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రం బలిమెల ప్రాంతంలో గంజాయిని తక్కువ ధరకు కొని కస్టమర్లకు ఆర్డర్‍ ఆధారంగా సప్లై చేసేవారు. ఇదే క్రమంలో బలిమెలలో 550 కిలోల ఎండు గంజాయి కొన్నారు. తర్వాత రెండు కిలోల ప్యాక్‍ చొప్పున 275 ప్యాకెట్లను తయారు చేశారు. తమ డీసీఎం వ్యాన్‍లో పైన టమాట పెట్టెలు తీసుకువెళ్లే సెటప్‍ చేసి.. కింద మాత్రం గంజాయి తరలించడానికి సపరేట్‍ బ్యారక్‍లు ఏర్పాటు చేశారు. అందులో గంజాయి ప్యాకెట్లను లోడ్‍ చేశారు.  

ఎస్కార్ట్​సాయంతో బలిమెల టు కర్నాటక 

బలిమెల నుంచి చింతూరు, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‍, వరంగల్‍, హైదరాబాద్‍ మీదుగా కర్నాటక రాష్ట్రానికి గంజాయి తరలించేలా ప్లాన్‍ చేశారు. వ్యాన్‍ ముందు ఓ కారు, బైక్‍ ఎస్కార్ట్ గా సోమవారం బయలుదేరారు. టాస్క్ ఫోర్స్​పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఏసీపీ జితేందర్‍రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు నరేశ్‍కుమార్‍, వెంకటేశ్వర్ల బృందం వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ఖానాపూర్‍ పోలీసులతో కలిసి బుధవారిపేట శివారులో తనిఖీలు చేపట్టారు. కారు, బైక్‍పై ఎస్కార్ట్ గా వస్తున్న వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో వెనకాల వస్తున్న గంజాయి వ్యాన్‍ సమాచారం చెప్పారు. పోలీసులు ఆ వెహికల్​ను తనిఖీ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖానాపూర్‍ తహసీల్దార్‍ సుభాషిణి ఆధ్వర్యంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.1 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు నరసింహారావు పరారయ్యాడు. ఖానాపూర్‍ మండలం మంగళవారిపేటకు చెందిన బానోతు చందు (38), కన్నబోయిన దుర్గాప్రసాద్‍ (30), రాయపర్తి గుబ్బాడి తండాకు చెందిన గుగులోత్‍ అనిల్‍ (20), బానోత్‍ మహేందర్‍ (27), భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‍కు చెందిన పిల్లలమర్రి శ్రీనివాసరావు (39), ఆంధ్రప్రదేశ్‍ అల్లూరి సీతారామారాజు జిల్లా మారెడిమిల్లికి చెందిన కత్తా చిన్నారెడ్డి (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వ్యాన్‍, కారు, బైక్‍తో పాటు ఐదు సెల్‍ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

వెంకటాపురంలోనూ..

ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కారులో తరలిస్తున్న 17బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బోదయ్ అజయ్ కుమార్, అతని తమ్ముడు భూక్య రమేశ్, మరో వ్యక్తి గుగులోతు కల్యాణ్​కలిసి ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొని కారులో వెంకటాపురం మీదుగా హైదరాబాద్​తరలిస్తున్నారు. వెంకటాపురంలో వెహికల్స్​తనిఖీ చేస్తున్న పోలీసులు గంజాయిని గుర్తించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

ఆఫీసర్లపై అలక.. ఫోన్లలో మునక..

భీమదేవరపల్లి, వెలుగు: గ్రామాల అభివృద్ధికి కీలకమైన మీటింగ్​ను అటు ఆఫీసర్లు ఇటు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలకేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. చాలామంది డుమ్మా కొట్టారు. వచ్చిన కొద్దిమంది ఫోన్లలో మునిగిపోయారు. మరికొందరు ఆఫీసర్లపై అలిగి సైలెంట్ గా ఉన్నారు. వచ్చిన ఆఫీసర్లు సైతం బుధవారం మంత్రి ప్రోగ్రాం ఉందంటూ మధ్యలోనే వెళ్లిపోయారు. ప్లేగ్రౌండ్ల బిల్లులు ఇంకా చెల్లించలేదంటూ ఎంపీటీసీలు మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత ఎంపీడీవో భాస్కర్, తహసీల్దార్ ఉమారాణి, ఆర్ డబ్య్లూఎస్​ డీఈ సువర్ణ తదితరులున్నారు.

ఓరుగల్లుకు బంగ్లాదేశ్ ఆఫీసర్లు

శానిటేషన్ నిర్వహణపై ఆరా

కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో టెక్నాలజీ  ద్వారా అత్యాధునిక పద్ధతుల్లో శానిటేషన్ ను నిర్వహిస్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. మంగళవారం బంగ్లాదేశ్ లోని ఫరీద్ పూర్ మున్సిపాలిటీ మేయర్ అమితావ బోస్, ఇతర ఆఫీసర్లు ఇక్కడి శానిటేషన్ నిర్వహణ గురించి తెలుసుకునేందుకు వరంగల్ కు రాగా.. మేయర్ తో పాటు కమిషనర్ ప్రావీణ్య వారికి పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్ బల్దియా పరిధిలో శానిటేషన్, వేస్టే మేనేజ్ మెంట్ సిస్టం తదితరాలపై మేయర్ వారికి వివరించారు. కాకతీయుల చరిత్ర, ఇక్కడి అభివృద్ధి పనులను వివరించారు. ఇటీవల వరంగల్ సిటీ యునెస్కో గ్లోబల్​నెట్​వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో కూడా చోటు దక్కించుకుందన్నారు.

దేవాదుల పనులు స్పీడప్ చేయాలి

జనగామ అర్బన్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు పనులు స్పీడప్ చేయాలని జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ప్రాజెక్టు పనులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. అశ్వరావుపల్లి, నవాబుపేట రిజర్వాయర్లు పురోగతిలో ఉన్నాయన్నారు. చెన్నూరు, పాలకుర్తి పనులు స్పీడప్​ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 965 చెరువులు ఉండగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా 486 చెరువులు నింపుతున్నామన్నారు. రివ్యూలో అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హామీద్, ఆర్డీవో క్రిష్ణవేణి తదితరులున్నారు.

జోడో యాత్రలో సీతక్క

ములుగు, వెలుగు: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కేరళకు తరలివెళ్లారు. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ యాత్ర చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి

కాజీపేట, హసన్ పర్తి,  వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్  ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం కాజీపేట మండలం మడికొడలో మహిళా సమాఖ్య, పరస్పర సహకార పొదుపు, పరపతి సంఘాల 13వ వార్షిక మహాసభకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా అభివృద్ధి చేసి, మహిళల ద్వారా అన్ని రకాల పంటలు కొనుగోళ్లు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అంతకుముందు మడికొండలో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎర్రగట్టుగుట్టలో 1, 2 డివిజన్లకు చెందిన 438మంది లబ్ధిదారులకు ఆసరా కార్డులు పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలకేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే రాజయ్య కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని మొత్తం 34మందికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంగా మారిందన్నారు. ప్రత్యేక తెలంగాణలో పేదల బతుకులు మారాయన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత, ఎంపీడీవో జవహర్ రెడ్డి, తహసీల్దార్ రజిని తదితరులున్నారు.