పార్లమెంట్​లో ఉభయసభల హోదా

పార్లమెంట్​లో ఉభయసభల హోదా

పార్లమెంట్​లో ఒకే సభ ఉంటే ఏకసభా విధానమని, రెండు సభలుంటే దానిని ద్విసభా విధానం అంటారు. భారత్​ పార్లమెంట్ లో లోక్​సభ, రాజ్యసభ, కొన్ని రాష్ట్రాల్లోని శాసనసభల్లో విధానసభ, విధాన పరిషత్​ లు ఉన్నాయి. అమెరికాలోని కాంగ్రెస్​లో ఎగువసభ సెనేట్​, దిగువ సభ హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​, ఇంగ్లండ్​లోని పార్లమెంట్​లో ఎగువసభ హౌస్​ ఆఫ్​ లార్డ్స్​, దిగువసభ హౌస్​ ఆఫ్​ కామన్స్​ ఉన్నాయి. పార్లమెంట్​లో రెండు సభలు ఉన్నప్పుడు ఉభయసభలను తులనాత్మకంగా పోలిస్తే సభ్యుల సంఖ్య, ప్రాతినిధ్యం, కాలపరిమితి లక్షణాలను గమనించవచ్చు. 

సభ్యుల సంఖ్య : సాధారణంగా దిగువ సభలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. కానీ, బ్రిటన్​ దిగువసభ కంటే ఎగువసభలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. 

ఉదాహరణ : ఇండియాలో లోక్​సభలో 545, రాజ్యసభలో 245, అమెరికా సెనేట్​లో 100, హౌస్​ ఆఫ్​ రిప్రెసెంటేటివ్స్​లో 435, బ్రిటన్​ హౌస్​ ఆఫ్​ కామన్స్​లో 650, హౌస్​ ఆఫ్​ లార్డ్స్​లో 788 మంది సభ్యులు ఉన్నారు. 

ప్రాతినిధ్యం : ఏ దేశంలోనైనా దిగువసభలో ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎగువసభలో దేశాన్నిబట్టి ప్రాతినిధ్యం మారుతూ ఉంటుంది.

ఉదాహరణ : ఇండియాలో రాజ్యసభ: రాష్ట్రాల ప్రతినిధి, అమెరికాలో సెనేట్​: రాష్ట్రాల ప్రతినిధి, ఇంగ్లండ్​లో హౌస్​ ఆఫ్​ లార్డ్స్​ కులీనుల/ ప్రభువుల ప్రతినిధి, భారతదేశంలోని రాష్ట్రల్లోని విధాన పరిషత్​: టీచర్లకు, గ్రాడ్యుయేట్లకు, స్థానిక సంస్థల ప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు ప్రతినిధి. 

కాల పరిమితి : ఏ దేశంలోనైనా దిగువసభ తాత్కాలికమైంది. ఎగువసభ శాశ్వత కాల పరిమితిని కలిగి ఉంటుంది. కానీ సభ్యులు నిర్ణీత కాలపరిమితిని కలిగి ఉంటారు. 

పార్లమెంట్​లో ఉభయసభల హోదా

పార్లమెంట్​లో లోక్​సభ, రాజ్యసభలను పరస్పరం పోల్చినప్పుడు మూడు రకాల పరిస్థితులను గమనించవచ్చు. అవి.. ఉభయ సభల సమాన హోదా, రాజ్యసభ అథమ హోదా, రాజ్యసభ ప్రత్యేక హోదా. 

ఉభయసభల సమాన హోదా : ఎగువసభ అయిన రాజ్యసభ లోక్​సభతో సమాన హోదాను కింది విషయాల్లో కలిగి ఉంటుంది. 
    

  •      సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు.
  •     సాధారణ బిల్లులను ఉభయసభలు తిరస్కరించవచ్చు.
  •     రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశ పెట్టడం, ఆమోదించే ప్రక్రియ రెండింటికీ సమానం.
  •     రాష్ట్రపతిని ఎన్నుకోవడం, తొలగించడంలో ఉభసభలు కూడా పాల్గొంటాయి.
  •     ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం, తొలగించడంలో ఉభయ సభలకు సమాన అధికారం ఉంటుంది.
  •     సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను, ప్రధాన ఎన్నికల కమిషనర్​, కాగ్​లను తొలగించమని రాష్ట్రపతికి సూచించడంలో రెండు సభలకు సమాన                   అధికారాలు ఉంటాయి. 
  •     రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్​లను రెండు సభలు ఆమోదిస్తాయి.
  •      రాష్ట్రపతి విధించే మూడు రకాల అత్యవసర పరిస్థితులను రెండు సభలు ఆమోదించడం.
  •     మంత్రులు ఏ సభలో నుంచైనా ఎంపిక చేయవచ్చు.
  •     ఆర్థిక సంఘం, కాగ్​, యూపీఎస్సీ సమర్పించే నివేదికలను చర్చించడం, ఆమోదించడం.
  •     బడ్జెట్​ను చర్చించే అధికారం రెండింటికీ ఉంది.
  •     సుప్రీంకోర్టు, యూపీఎస్సీ అధికార పరిధిని విస్తరింపజేయడం. 

రాజ్యసభ అథమ హోదా : లోక్​సభతో పోల్చినప్పుడు రాజ్యసభ కింది విషయాల్లో తక్కువ అధికారాలు కలిగి ఉంటుంది. 
  

  •  ఆర్థిక బిల్లులను ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు.
  •     రాజ్యసభ ఆర్థిక బిల్లు విషయంలో కేవలం మార్పులను మాత్రమే సూచించాలి. తిరస్కరించకూడదు. ఈ మార్పులతో ఏకీభవించడం లేక తిరస్కరించడం లోక్​సభ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. 
  •     ఒక బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించే అధికారం లోక్​సభ స్పీకర్​కే ఉంటుంది. 
  •     ఉభయ సభల సభ్యులను పోల్చినప్పుడు రాజ్యసభ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
  •     ఉమ్మడి సమావేశంలో సాధారణంగా లోక్​సభ అభిప్రాయమే చెల్లుబాటు అవుతుంది. 
  •     ఉమ్మడి సమావేశానికి లోక్​సభ స్పీకర్​ లేక డిప్యూటీ స్పీకర్లు మాత్రమే అధ్యక్షత వహిస్తారు. 
  •     బడ్జెట్​పై ఓటింగ్​ చేసే అధికారం రాజ్యసభకు లేదు. 
  •     జాతీయ అత్యవసర పరిస్థితిని ఉపసంహరించే తీర్మానం చేసే అధికారం లోక్​సభకు మాత్రమే ఉంది. రాజ్యసభకు లేదు. 
  •     మంత్రిమండలి ఉమ్మడిగా లోక్​సభకే బాధ్యత వహిస్తుంది.
  •     అవిశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం, ధన్యవాద తీర్మానం, అభిశంసన తీర్మానం, కోత తీర్మానాలు వంటివి లోక్​సభలో మాత్రమే ప్రవేశపెట్టి ఆమోదం పొందుతాయి. 
  •     అంచనాల సంఘంలో లోక్​సభ సభ్యులు మాత్రమే ఉంటారు. 

ప్రత్యేక హోదా : భారతదేశంలో ఉన్న సమాఖ్య వ్యవస్థను రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి రాజ్యసభకు ప్రత్యేక అధికారం కల్పించారు. కింది అంశాల్లో రాజ్యసభకు లోక్​సభకు లేని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. 

ఆర్టికల్​ 67 ప్రకారం : ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభ తీర్మానం ఆమోదించిన తర్వాతనే అది లోక్​సభకు పంపాల్సి ఉంటుంది. 

ఆర్టికల్​ 249 ప్రకారం : రాష్ట్ర జాబితాపై జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్​ చట్టం చేయాలని భావిస్తే ముందుగా రాజ్యసభ తీర్మానం చేయాలి. 

ఆర్టికల్​ 312 ప్రకారం : నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే ముందుగా రాజ్యసభలో సభకు హాజరై ఓటువేసిన వారిలో 2/3 వంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి. 
ఆర్టికల్స్​ 352, 356, 360 ఆధారంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్​సభ రద్దయి ఉంటే రాష్ట్రపతి చేసిన ఆ ప్రకటనను ముందుగా రాజ్యసభ ఆమోదించాల్సి ఉంటుంది.