ఇదెక్కడి న్యాయం..! ఇద్దరి పని ఒకటే.. జీతాల్లో మాత్రం భారీ తేడా..!

ఇదెక్కడి న్యాయం..! ఇద్దరి పని ఒకటే.. జీతాల్లో మాత్రం భారీ తేడా..!
  • గిగ్‌‌‌‌ వర్కర్లు, పర్మినెంట్ ఉద్యోగుల జీతాల మధ్య పెరుగుతున్న అంతరం
  • 25 శాతం వరకు  శాలరీ గ్యాప్‌ ఉందని జీనియస్ రిపోర్ట్ వెల్లడి
  • గిగ్‌‌‌‌ వర్కర్ల స్కిల్స్ పెంచి, ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ అవసరాలకు తీసుకోవాలి
  • ఇండియాలో వేగంగా విస్తరిస్తున్న గిగ్‌‌‌‌ ఎకానమీ

న్యూఢిల్లీ: చేసే పని ఒకటే కాని అందుకునే జీతంలో మాత్రం చాలా తేడా. గిగ్‌‌‌‌ వర్కర్లు (తాత్కాలిక/ఫ్రీలాన్స్ ఉద్యోగులు), పర్మినెంట్ ఉద్యోగుల జీతాల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందని హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కంపెనీ జీనియస్ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌  ఒక రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ఈ ఏడాది పండుగ సీజన్‌‌‌‌లో గిగ్‌‌‌‌ వర్కర్ల నియామకాలు భారీగా పెరిగాయని తెలిపింది. ఈ రిపోర్ట్‌‌‌‌ను  సెప్టెంబర్ 1–30 మధ్య 1,550 మంది ప్రొఫెషనల్స్‌‌ను సర్వే చేసి రెడీ చేసింది. 

ఇందులో  47 శాతం మంది గిగ్ వర్కర్లకు పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగుల కంటే తక్కువ జీతం వస్తోందని పేర్కొన్నారు. గిగ్ వర్కర్లకు గంటకు చెల్లించే జీతం పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగుల జీతంతో పోలిస్తే ఎంత తక్కువగా ఉందని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు, 11 శాతం మంది 10 శాతం లోపల తేడా ఉందన్నారు. 23 శాతం మంది 10–25 శాతం మధ్య ఉందని, 13 శాతం మంది 25 శాతం కంటే ఎక్కువ తేడా ఉందని తెలిపారు.

అంటే, దాదాపు సగం మంది వేతన అసమానతను గుర్తించారు. ‘‘పండుగల సమయంలో గిగ్ వర్కర్ల నియమకాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి చేసే పనులు కూడా బాగా పెరిగాయి. అయినప్పటికీ, పర్మినెంట్ ఉద్యోగితో పోలిస్తే ఒకే పనికి గిగ్‌‌‌‌వర్కర్లు అందుకునే జీతం తక్కువగా ఉంది. సమాన జీతం లభించకపోవడం ఆందోళనకరం”అని జీనియస్ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టెక్  చైర్మన్ ఆర్.పీ.యాదవ్ పేర్కొన్నారు.

"సమాన పనికి.. సమాన జీతం" అనే సూత్రం పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగాలకే పరిమితం కాకుండా గిగ్ ఉద్యోగాలకూ వర్తించాలన్నారు. స్కిల్స్ పెంచడం, పారదర్శకత, సరియైన జీతం ఇవ్వడం  ద్వారా గిగ్ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను డెవలప్‌‌‌‌ చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

తక్కువ జీతానికి కారణాలు..

గిగ్ వర్కర్లకు పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగుల మాదిరిగానే గంటకు సమాన జీతం ఇవ్వాలని సర్వేలో పాల్గొన్న  73 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాంగ్‌‌‌‌టెర్మ్‌‌‌‌లో ప్రయోజనం లేకపోవడంతో గిగ్‌‌‌‌వర్కర్లకు సంస్థలు తక్కువ శాలరీ ఇస్తున్నాయి. 56 శాతం మంది ఈ విషయాన్ని వెల్లడించారు.

గిగ్‌‌‌‌ వర్కర్ చేసే పని వ్యవధి తక్కువ కావడంతో జీతాల్లో అసమానత ఉందని  సర్వేలో పాల్గొన్న 24 శాతం మంది, తక్కువ నైపుణ్యం లేదా శిక్షణ స్థాయి ఉండడంతోనేనని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు.  కేవలం 3 శాతం మంది మాత్రమే గిగ్, పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగుల మధ్య వేతన తేడా లేదని తెలిపారు. జీతం మినహా ఇస్తే,  ఇతర ప్రయోజనాల విషయంలో గిగ్‌‌‌‌వర్కర్ల స్కిల్స్ పెంచాలని  43 శాతం మంది కోరారు. 

ఫ్లెక్సిబుల్ షిఫ్టులను ఇవ్వాలని 31 శాతం మంది , రవాణా, భోజన సౌకర్యాలను కల్పించాలని 13 శాతం మంది, పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగాలకు మారే అవకాశాలను ఇవ్వాలని 9 శాతం మంది కోరారు. కాగా,   భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గిగ్ ఆర్థిక వ్యవస్థలో సమానత్వం, స్టెబిలిటీ, ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జీనియస్ రిపోర్ట్‌‌‌‌ ద్వారా తెలుస్తోంది.