ఎన్నికల అఫిడవిట్​లో వేర్వేరు విద్యార్హతలు చూపిన్రు : రఘునందన్

ఎన్నికల అఫిడవిట్​లో వేర్వేరు విద్యార్హతలు చూపిన్రు :  రఘునందన్
  • ఎలక్షన్​ కమిషన్​కు లేఖ   
  • దళితుల భూమిలోనే ఫామ్​హౌస్ కట్టారని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లేఖ రాశారు. 2009 ఎన్నికల అఫిడవిట్​లో ఒకలా, 2018 ఎన్నికల అఫిడవిట్​లో మరోలా విద్యార్హతలు చూపిన ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు. 2009 అఫిడవిట్​లో స్వీడన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు, 2018 అఫిడవిట్ లో ఇంటర్ పాస్ అయినట్లు రోహిత్ రెడ్డి పేర్కొనడాన్ని సీరియస్​గా తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బెంగళూరు డ్రగ్స్ కేసును తిరిగి బయటకు తీయండని బీజేపీ స్టేట్​అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన మాటలను తప్పుగా ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. సంజయ్ ఎక్కడా బీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పలేదని, అనని మాటలను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్​లో15 రోజుల పాటు నేర్చుకున్న చిలక పలుకులనే పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనతో ఫామ్​హౌస్ కేసు నిందితులు సింహయాజీ, నందుతో ఎంతోకాలంగా వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నారు. ఈ ట్రయాంగిల్ బంధాన్ని  సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. 

రూ.200 కోట్ల భూకబ్జాకే ఈడీ నోటీసులు.. 

బండి సంజయ్ చెబితేనే రోహిత్ కు ఈడీ నోటీసులు వచ్చాయని మంత్రి హరీష్ రావు చెప్పడంపైనా రఘునందన్ మండిపడ్డారు. మజ్లిస్ తో కలిసి విద్యా వికాస సమితి పేరుతో రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసినందుకే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. దళితులకు కేటాయించిన భూమిలోనే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కట్టుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సర్పన్ పల్లి రిసార్ట్స్ లో ఏ దందాలు నడుస్తున్నాయి? సినిమా వాళ్లు ఎవరెవరు వస్తున్నారో చెప్పాలన్నారు. ‘‘బెంగళూరు డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లతో నీకు ఉన్న సంబంధాలు ఏమిటి? డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వద్ద ప్రమాణం ఎందుకు చేయలేదు?” అని ప్రశ్నించారు. జై తెలంగాణ అని ఏనాడూ అనని రోహిత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ అంటేనే నోటీసులు ఇస్తున్నారనడాన్ని తప్పుపట్టారు. కేసీఆర్ బీఫామ్ ఇవ్వనంటే.. వేరే పార్టీలో గెలిచి వచ్చి ఇప్పుడు ఆ పార్టీలోని ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.