అటు తెగుళ్లు.. ఇటు కరెంట్​ కోతలు

అటు తెగుళ్లు.. ఇటు కరెంట్​ కోతలు
  • ఉల్లికోడు, అగ్గితెగులుతో ఎర్రబారుతున్న పైరు
  • నీటి తడులందక ఎండిపోతున్న పొలాలు 
  • కరెంటు 12 గంటలు ఇవ్వాలని రైతుల డిమాండ్​


కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్​ నాట్లు పూర్తయ్యాయో లేదో..  వరి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆదిలోనే తెగుళ్లు వ్యాప్తి చెందుతూ వరి పొలాలను దెబ్బ తీస్తుండగా.. కరెంటు కోతలు రైతుల ఆశలను ఆవిరి చేస్తున్నాయి.   నిజామాబాద్ లో 3.84 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో  2.60 లక్షల ఎకరాలు  మొత్తం  6.44 లక్షల ఎకరాల్లో రైతుల వరి పంట సాగు చేశారు. నిరుడు కంటే  2 లక్షల   ఎకరాలు ఎక్కువగానే వరి నాట్లేశారు. 

తెగుళ్లతో ఎదగని పైరు..

మాచారెడ్డి, రామారెడ్డి, భిక్కనూరు, కామారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, సదాశివనగర్​,  తాడ్వాయి, దోమకొండ, బీబీపేట తదితర మండలాల్లలో భారీగా వరి సాగు చేశారు. నాట్లేసి నెల దాటుతున్నా  మొగి పురుగు, ఉల్లికోడు, అగ్గి తెగులు లాంటి వివిధ రకాల తెగుళ్ల వ్యాప్తితో  పైరు ఎదగడం లేదు. దీంతో చాలా వరకు చేన్లు ఎర్రబారి క్రమంగా ఎండిపోతున్నాయి.  తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవడానికి ఆయా రకాల పెస్టిసైడ్స్​స్ప్రే చేస్తున్నామని రైతులు వాపోతున్నారు.  ఎకరాకు రూ.1,500  నుంచి రూ. 4 వేల వరకు పెట్టుబడికి అదనంగా ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్నారు. అయినప్పటికీ పంట చేతికొస్తుందో లేదో నని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వాతావరణ పరిస్థితుల ప్రభావం.. పంట మార్పిడి చేయకపోవడం వల్లే తెగుళ్ల వ్యాప్తి పెరుగుతోందని 
 అగ్రికల్చర్​ఆఫీసర్లు చెప్తున్నారు. 

 కరెంటు కష్టాలు..

వ్యవసాయానికి 24  గంటలు కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా..  రోజుకు కనీసం  8 గంటలు కూడా సప్లై కావడం లేదని రైతులు చెప్తున్నారు. అది కూడా ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో  తెలియక పారిన మడిని మళ్లీ పారించాల్సి వస్తోందని వాపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో లక్షా 5 వేల అగ్రికల్చర్ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి.  సాగు నీటి  ప్రాజెక్టులు లేకపోవడంతో  బోరు బావులపై ఆధారపడే రైతులు ఇక్కడ పంటలు సాగు చేస్తారు.  భారీ వర్షాలు పడి భూగర్భజలాలు పెరగడంతో నిరుడు కంటే ఈ  యేడు జిల్లాలో లక్షా ఎకరాల్లో వరి పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు.  నీళ్లున్నా.. కరెంటు కోతలతో పొలాలు పారడం లేదు. వరి పొలాల్లో నీళ్లు తగ్గి బీటలు వారుతున్నాయి. ఎండలు ముదరక ముందే పరిస్థితి ఇలా ఉంటే , వచ్చే ఎండా కాలంలో భూగర్భ జలాలు తగ్గితే,  వచ్చీ పోయే కరెంట్​తో పరిస్థితి ఏమిటోనని  రైతులు ఆందోళన చెందుతున్నారు. 


12 గంటలు కరెంట్​ఇవ్వాలి

4 ఎకరాల్లో వరి సాగు చేసిన. కరెంటు ఎప్పుడొస్తుందో పోతుందో తెలియడం లేదు. ఎండలూ పెరుగుతుండడంతో పారిన మడే మళ్లా పారుతోంది. వ్యవసాయానికి 24 గంటలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.  కనీసం 12 గంటల పాటైనా సరిగా ఇస్తే బాగుండు. 
- ల్యాగాల సాయిరెడ్డి, రామారెడ్డి మండలం

12 గంటల పాటు ఇస్తున్నాం

జిల్లాలో అగ్రికల్చర్​కు 12 గంటల పాటు కరెంటు సప్లై జరుగుతోంది.  పంటలు ఎండిపోకుండా కరెంటు సప్లై చేస్తాం.  ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ కూడా సమస్య రాకుండా చూస్తున్నాం.  
 - రమేశ్​, ఎస్ఈ ఎన్​సీడీసీఎల్​, కామారెడ్డి

ఈ ఫొటోలో ఉన్న రైతు మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన  మగ్గిడి లక్ష్మీనర్సు. 2 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు.  రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాడు. నాటేసిన నెల రోజుల్లోనే వివిధ రకాల తెగుళ్లు సోకడంతో  ఇప్పటికే 3 సార్లు మందులు స్ప్రే చేశానని, దానికి రూ. 6 వేలు ఖర్చు చేశానని చెప్తున్నాడు. దానికి తోడు కరెంటు కోతలతో పొలానికి తడులు అందక నెర్రెలు బారుతున్నాయని వాపోతున్నాడు.


తెగులు సోకిన వరి పైరును చూపుతున్న ఈ  రైతు రామారెడ్డి మండల కేంద్రానికి  చెందిన లింగాల రవి. 2 ఎకరాల్లో వరి వేశాడు. తెగులు సోకి పంట ఎదగకపోతే ఇప్పటికే రెండు సార్లు మందు స్ప్రే చేశానని చెప్తున్నాడు. రూ. 3,500 వరకు ఖర్చయ్యిందన్నారు. తెగుళ్ల వ్యాప్తి నుంచి పంటను కాపాడుకున్నా.. తరుచూ కరెంటు వచ్చీ పోతుండడంతో నీళ్లు పారిన  మడులే మళ్లీ పారుతూ  కింది మడులు ఎండిపోతుందన్నారు.