సర్కారు అందాద లెక్కలు.. రైతుల బీమాకు తిప్పలు

సర్కారు అందాద లెక్కలు.. రైతుల బీమాకు తిప్పలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైతు బీమాకు ఏటా సరిపడా నిధులను  సర్కారు విడుదల చేయకపోవడంతో చాలా మంది బీమా పరిధిలోకి రాక వేలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన పైసలు ప్రీమియంకు సరిపోక చాలా మందికి బీమా ఐడీలు రాకపోవడం, ఆ తర్వాత బీమా క్లెయిమ్‌‌‌‌ కాకపోవడంతో ఎంతో మంది అవస్థ పడుతున్నారు. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి కూడా రైతుల ప్రీమియంకు సర్కారు డబ్బులు తక్కువే విడుదల చేసింది. దాదాపు రూ. 1,200 కోట్లు అవసరం ఉండగా రూ. 800 కోట్లనే ఇచ్చింది. ఇలా ఏటా అందాద లెక్కలతో ప్రభుత్వం పైసలిస్తుండటంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏండ్లయినా బీమా రావట్లేదు. వివిధ కారణాలతో గత మూడేళ్లలో 5,650 కుటుంబాలకు రూ. 285.50 కోట్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.  
సర్కారు ప్రీమియం కట్టక..
రైతు బీమాకు 18 ఏళ్ల నుంచి 59 ఏండ్ల వయసు మధ్యనున్న వాళ్లు అర్హులు. రైతుల సంఖ్య ప్రకారం ఏటా ఆగస్టు 14లోగా ఎల్‌‌‌‌ఐసీకి సర్కారు ముందస్తుగా ప్రీమియం కడుతోంది. సర్కారు ఇచ్చిన నిధుల్లోంచి ఒక్కో రైతుకు సంబంధించి ఇన్సూరెన్స్‌‌‌‌ ప్రీమియంను ఎల్‌‌‌‌ఐసీ కట్‌‌‌‌ చేసుకుని రైతులకు ఐడీలు ఇస్తుంది. సర్కారు ఇచ్చిన డబ్బుల కన్నా ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ చేసుకున్న రైతులు ఎక్కువ కావడంతో ప్రీమియంకు నిధులు చాలక చాలా మంది రైతులకు గతంలో ఐడీలు రాలేదు. ఇలా ఐడీల్లేక 2018-–19లో 225 మందికి, 2019–20 సీజన్‌‌‌‌లో 558 మందికి క్లెయిమ్స్‌‌‌‌ నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం, ఎల్‌‌‌‌ఐసీ కొర్రీలతో 2020–21లో 4,867 క్లెయిమ్స్‌‌‌‌ ఆగాయి. కొన్ని జిల్లాల్లో డెత్ సర్టిఫికెట్లను ఎల్ఐసీ గుర్తించక, కొన్ని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్రూవ్‌‌‌‌ కాక, కొన్ని డెత్‌‌‌‌ సర్టిఫికెట్లకు క్లియరెన్స్‌‌‌‌ రాక రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిహారం కోసం రైతుల కుటుంబాలు ఏండ్లుగా అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.  
ఈ ఏడాది బీమాకు కసరత్తు..
రైతు బీమా కోసం 2018–19లో 31.27 లక్షల మంది రైతులు అర్హత పొందగా ఒక్కొక్కరికీ ప్రీమియం రూ. 2,271.50 చొప్పున రూ. 710.58 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 201–20లో 32.16 లక్షల మందికి రూ.3,457.50 చొప్పన రూ.1,065.37 కోట్లు కట్టింది. 2020--–21లో 32.73 లక్షల మంది రైతులకు రూ. 3,486.90 చొప్పున రూ.1,141.44 కోట్లను చెల్లించింది. ఈ యేడాది ఆగస్టు 14 వరకు బీమా గడువు పూర్తవుతుంది. ఈ యేడాది భూములు క్రయ విక్రయాలు జరగడంతో మరో 3 లక్షల మంది బీమాకు అర్హత పొందే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ ఏడాదికి రూ. 1,200 కోట్లు అవసరం. సర్కారు ఇప్పటికి రూ. 800 కోట్లే రిలీజ్‌ చేసింది. బీమా ప్రీమియం, దరఖాస్తు గడువుపై వ్యవసాయ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. 3..4 రోజుల్లో బీమా దరఖాస్తుకు అవకాశం కల్పించనుంది.