కాంగ్రెస్ లొల్లి..హైదరాబాదుకు ద్విగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ లొల్లి..హైదరాబాదుకు ద్విగ్విజయ్ సింగ్

నేతలను సమన్వయపర్చడానికే కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్​ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మల్లు రవి స్పష్టం చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్గం పార్టీ కమిటీకి రాజీనామా చేసిందని చెప్పారు. దిగ్విజయ్ పార్టీ నేతలతో మాట్లాడాక.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తనకు వంద శాతం నమ్మకముందని మల్లు రవి విశ్వాసం వ్యక్తం చేశారు.

దిగ్విజయ్ సింగ్ వచ్చిన తర్వాత సీనియర్ నాయకులతో, ఆ తర్వాత రేవంత్ రెడ్డితో మాట్లాడతారని చెప్పారు. వీటితో పాటు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేయడంపై మాట్లాడతారని తాము అనుకుంటున్నట్టు మల్లు రవి తెలిపారు. ఏ సమస్యా లేకుండా అందరూ కలిసి ఉండాలని, అందర్నీ సమన్వయపర్చడానికే ఆయన వస్తున్నారని చెప్పారు. ఇలా చాలా సార్లు కాంగ్రెస్ లో వచ్చిన సమస్యలపై మాట్లాడుకున్న సందర్భాలున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఒక కేసుపై కోర్టులో వాదనలు జరుగుతున్నపుడు బయట ఎవరూ దానిపై వ్యాఖ్యలు చేయకూడదని, అలాగే దిగ్విజయ్ సింగ్ ఎలాగూ ఇక్కడికి వస్తున్నారు.. కాబట్టి మళ్లీ ఆయన ఏం మాట్లాడుతారు.. సమస్య ఏంటీ అన్న దానిపై మాట్లాడడం మంచిది కాదని మల్లు రవి అన్నారు. ఇప్పుడున్న సీనియర్ కాంగ్రెస్ నేతలంతా సేవ్ కాంగ్రెస్ అంటున్నారు కాబట్టే హై కమాండ్ దీనిపై చర్చించాలనుకుంటోందని, సేవ్ బీజేపీ అనేది వాళ్ల నినాదం అయితే వాళ్లు వచ్చేవాళ్లు కాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు సాయంత్రం దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు రానున్నారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను గాడిన పెట్టే పనిలో భాగంగానే ఆయన రేపు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.