పల్లెటూళ్లలో డిజిటల్ దీదీలు..

V6 Velugu Posted on Apr 02, 2021

ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉన్నా.. పరిస్థితులు అనుకూలించక ఆగిపోయేవాళ్లు ఎందరో.  గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కొంత చదువుకున్న అమ్మాయిలు కూడా.. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీలుగా మారుతున్న పరిస్థితి. అలాంటప్పుడు అసలు చదువుకోని వాళ్ల సంగతి సరేసరి!. అయితే వాళ్లకు డిజిటల్ పాఠాలు నేర్పడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు సాయపడుతోంది మన్‌‌‌‌ దేశీ ఫౌండేషన్‌‌‌‌. 

మన్‌‌‌‌ దేశీ..  మహారాష్ట్రలో గ్రామీణ మహిళల కోసం పని చేస్తున్న  ఒక ఫౌండేషన్‌‌‌‌. సతారా జిల్లాలోని మస్వాద్‌‌‌‌ గ్రామం కేంద్రంగా ఈ ఫౌండేషన్‌‌‌‌ పని చేస్తోంది. ఏదైనా పనిలో సక్సెస్‌‌‌‌ సాధించాలంటే డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ పనిలో స్కిల్స్‌‌‌‌ (నైపుణ్యం) తప్పకుండా ఉండాలి. అందుకే  గ్రామీణ మహిళల్లో వర్కింగ్ స్కిల్స్‌‌‌‌ను పెంచే బాధ్యత తీసుకుంది. అంతేకాదు ఎంట్రప్రెనూర్‌‌‌‌లకు సమానమైన మార్కెట్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ను గ్రామీణ మహిళలకి అందిస్తోంది ఈ ఫౌండేషన్‌‌‌‌.  మహారాష్ట్ర రూరల్‌‌‌‌ ప్రాంతాల్లో అమ్మాయిలు.. స్కూల్ దశలోనే చదువు ఆపేస్తున్నారు.  చదువుకోకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదు.  పోనీ.. కుటీర పరిశ్రమలు పెట్టుకుందామన్నా లోన్లు దొరకడం లేదు. అందుకే, వాళ్లకు ఆసరాగా నిలిచేందుకు ఏర్పాటైంది మన్‌‌‌‌ దేశీ ఫౌండేషన్‌‌‌‌.  

డిజిటల్ లిటరసీ
మస్వాద్‌‌‌‌ పక్కా పల్లెటూరు. కానీ, అక్కడున్న ఆడవాళ్లలో చాలామందికి డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఎలా చేయాలో తెలుసు.  అంతేకాదు వాట్సాప్‌‌‌‌ లాంటి యాప్‌‌‌‌లను ఉపయోగిస్తుంటారు. టైలరింగ్‌‌‌‌, పశుపోషణ, వ్యవసాయం గురించి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు వింటారు. డిజిటల్ ప్రపంచం వల్ల కలిగే ప్రయోజనాలేంటో వీళ్లకు బాగా తెలుసు.  అయితే ఇదంతా తేలికగా జరగలేదు. ఇక్కడున్న మహిళలు డిజిటల్ లిటరసీ సాధించడం వెనుక మన్‌‌‌‌ దేశీ ఫౌండేషన్‌‌‌‌ మూడేళ్ల శ్రమ దాగుంది.  ముందుగా డిజిటల్ వలంటీర్లు, స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు ఎలా ఉపయోగించాలో రకరకాల పద్ధతుల్లో అర్థమయ్యేలా ఒక బ్యాచ్‌‌‌‌కి పాఠాలు చెప్తారు. వారం తర్వాత ఆ బ్యాచ్‌‌‌‌ను డిజిటల్ ట్రైనర్లుగా గుర్తిస్తారు.  వీళ్లకు ‘డిజిటల్ దీదీ’లు అనే ఐడెంటిటీ ఇస్తారు. దీదీ అంటే అక్క లేదా చెల్లెలు. ఈ దీదీలు ఊరూరూ తిరుగుతూ.. మరికొందరికి డిజిటల్‌‌‌‌ పాఠాలు నేర్పిస్తారు. 

ఇబ్బందులు ఎదురైనా.. 
ప్రస్తుతం డిజిటల్ దీదీలు మహారాష్ట్రలోని 12 జిల్లాల్లో పని చేస్తున్నారు. ఈ పనికి వీళ్లకు శాలరీ కూడా ఇస్తోంది ఫౌండేషన్‌‌‌‌. ఈ డిజిటల్ లిటరసీ ప్రాజెక్ట్‌‌‌‌ సక్సెస్‌‌‌‌లో వెన్నెముకలా నిలిచింది వనితా షిండే. మొదట్లో ఈమె సెల్ఫ్‌‌‌‌ ఎంట్రప్రెనూర్‌‌‌‌. ఆ తర్వాత ఫౌండేషన్‌‌‌‌తో చేతులు కలిపి పని చేస్తోంది. మస్వాద్‌‌‌‌ మహిళలు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేయడానికి వనిత ఎంతో ఓర్పుతో పని చేసింది. మొదట్లో మస్వాద్ మహిళలు డిజిటల్ క్లాసులకు ఆసక్తి చూపించలేదు. పైగా వాళ్లలో చాలామందికి సెల్‌‌‌‌ఫోన్లు లేవు.  దీంతో ఒకేదగ్గర క్లాసులు చెప్పించారు.  డిజిటల్ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ వల్ల జరిగే లాభాల గురించి వివరించారు.  ప్రభుత్వ పథకాల గురించి అవగాహన, పోషకాలున్న తిండి గురించి, చిన్నచిన్న వ్యాపారాలకు సంబంధించిన అనుమానాలను ఆన్‌‌‌‌లైన్ ద్వారా తీర్చుకోవడం ప్రారంభించారు వాళ్లు. ఇలా నెమ్మది నెమ్మదిగా డిజిటల్ ఎకోసిస్టమ్‌‌‌‌లోకి అడుగుపెట్టారు. 

బ్యాంక్‌‌‌‌ & బిజినెస్‌‌‌‌ స్కూల్‌‌‌‌
ముంబై సోషల్‌‌‌‌ యాక్టివిస్ట్‌‌‌‌ చేతన సిన్హా1996లో  మన్‌‌‌‌ దేశీ  ఫౌండేషన్‌‌‌‌ను  ప్రారంభించింది. మొదట్లో రకరకాల వృత్తుల్లో మహిళలకు శిక్షణ అందించేది ఈ ఫౌండేషన్‌‌‌‌. అయితే సమస్యలు ఎదురైతే.. పరిష్కారం కోసం మళ్లీ వాళ్లంతా ఫౌండేషన్‌‌‌‌ దగ్గరికే వచ్చేవాళ్లట. దీంతో వర్క్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేర్పించడం మొదలుపెట్టారు. అలాగే ఈ రీజియన్‌‌‌‌లో ఆర్థికంగా వెనుకబాటు ఎక్కువగా ఉంది. అందుకే  ఫౌండేషన్‌‌‌‌ తరపున ‘మన్‌‌‌‌ దేశీ మహిళా సహకారి బ్యాంక్‌‌‌‌’ ను ప్రారంభించారు. ‘బై ది విమెన్‌‌‌‌.. ఆఫ్ ది విమెన్‌‌‌‌.. ఫర్‌‌‌‌ ది విమెన్‌‌‌‌’.. పూర్తిగా ఆడవాళ్లు నడిపిస్తున్న బ్యాంక్‌‌‌‌ ఇది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన ఆడవాళ్లే ఈ బ్యాంక్‌‌‌‌ నిర్వహణను చూసుకుంటున్నారు. డబ్బు దాచుకోవడానికి, బ్యాంక్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌తో పాటు లోన్లు కూడా ఇస్తుంది ఈ బ్యాంక్‌‌‌‌.  సతారాతో పాటు ఆరు జిల్లాలలో ఈ బ్యాంక్‌‌‌‌కి బ్రాంచ్‌‌‌‌లు ఉన్నాయి.  ఆ తర్వాత మహిళలే చిన్న పరిశ్రమలను నిర్వహించుకొనేలా ‘మన్‌‌‌‌ దేశీ ఉద్యోగిని’ పేరుతో ఒక బిజినెస్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ప్రారంభించింది ఫౌండేషన్‌‌‌‌.  ఈ బిజినెస్‌‌‌‌స్కూల్‌‌‌‌ కోర్సులు.. ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌,  టెక్నికల్ స్కిల్స్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌ నేర్పించడంతో పాటు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాయి. ఇక స్కూల్‌‌‌‌కి వెళ్లి ట్రైనింగ్ తీసుకోలేని వాళ్ల కోసం.. బిజినెస్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ‘ఆన్‌‌‌‌ వీల్స్‌‌‌‌’ వెహికిల్​ వాళ్ల దగ్గరికే వెళ్తోంది. ఇప్పటిదాకా మన్‌‌‌‌ దేశీ ఫౌండేషన్‌‌‌‌ ద్వారా నాలుగు లక్షల మంది మహిళలు లాభపడ్డారు.  ‘పల్లెల్లో మహిళలు తమ కాళ్లమీద తాము నిలబడాలి. మరికొందరికి చేయూతనివ్వాలి’.. అనే ఆశయంతో ముందుకెళ్తున్న మన్‌‌‌‌ దేశీ ఫౌండేషన్‌‌‌‌ ప్రయత్నాలకు ఎన్నో అవార్డులు దక్కాయి కూడా.

Tagged business, Maharashtra, VILLAGES

Latest Videos

Subscribe Now

More News