
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా జీవన విధానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఐదేళ్ల కిందట లాంచ్ చేసిన డిజిటల్ ఇండియా ప్రజల జీవితాల్లో భాగంగా మారిపోయిందన్నారు. బెంగళూరులో జరిగిన టెక్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న మోడీ.. టెక్నాలజీ గురించి పలు విషయాలు పంచుకున్నారు.
‘డిజిటల్ ఇండియాకు కృతజ్ఞతలు. మనిషి కేంద్రంగా అభివృద్ధికి మన దేశంలో అధిక ప్రాధాన్యం ఇస్తాం. టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించడం మన పౌరుల జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఈ ప్రయోజనాలు అందరికీ చేరువవుతున్నాయి. టెక్నాలజీ ఫస్ట్ అనే ప్రాతిపదికన ప్రభుత్వం ముందుకెళ్తోంది. లాక్‌డౌన్ సమయంలో దేశంలోని పేదలకు సరైన సమయంలో సాయాన్ని అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించింది. మనం ఇన్ఫర్మేషన్ యుగంలో కీలక దశలో ఉన్నాం. మన లోకల్ టెక్నాలజీ సొల్యూషన్స్ గ్లోబల్ స్థాయి సమస్యలకు పరిష్కారం చూపగలవు. ప్రపంచవ్యాప్త టెక్నాలజీ సమస్యల పరిష్కారానికి ఇండియాలో సమాధానాలను కనుగొనాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మోడీ పేర్కొన్నారు.