
తిరువనంతపురం: సీపీఎం వ్యవస్థాపక సభ్యుడు, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్(101) కన్నుమూశారు. 2025, జూన్ 23న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన అచ్యుతానందన్ చికిత్స పొందుతూ సోమవారం (జూలై 21) తుదిశ్వాస విడిచారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అచ్యుతానందన్ మృతిని ధృవీకరించింది. కేరళ రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందిన అచ్యుతానందన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మూడుసార్లు కేరళ విపక్ష నేతగా పని చేసిన అచ్యుతానందన్.. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పాలన అందించారు.
వీఎస్ అచ్యుతానందన్ నేపథ్యం:
1923 అక్టోబర్ 20న అలప్పుజ జిల్లాలోని పున్నప్రాలో జన్మించారు అచ్యుతానందన్. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన1938లో స్టేట్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత దానికి గుడ్ బై చెప్పి1940లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)లో జాయిన్ అయ్యారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 1957లో CPI కేరళ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1964లో CPI జాతీయ మండలి నుండి వైదొలిగి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మంది సభ్యులలో ఆయన ఒకడిగా ఉన్నారు.1980 నుంచి1992 మధ్య ఆయన కేరళ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పని చేశారు.
వరుసగా మూడుసార్లు కేరళ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా పని చేశారు. 2016 నుంచి 2021 వరకు క్యాబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్‌గా సేవలు అందించారు. అనారోగ్యం, వయోభారం కారణంగా ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేరళ రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి అయిన అచ్యుతానందన్.. చివరి వరకు వామపక్ష ఆదర్శాల పట్ల రాజీలేని నిబద్ధత ప్రదర్శించడంతో పాటు కడదాకా ప్రజల కోసం అవిశ్రాంతంగా పోరాడారు.