
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సోమవారం (జులై 21) ప్రారంభమైన సమావేశాలు.. అధికార ప్రతిపక్ష నేతల ఆందోళన నడుమ మంగళవారానికి వాయిదాపడ్డాయి. తొలిరోజే ఆపరేషన్ సిందూర్, ట్రంప్ ప్రకటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చివరికి చర్చకు అంగీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ALSO READ | పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు... లోక్ సభలో గందరగోళం..
పార్లమెంటు వాయిదా అనంతరం.. ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సిందూర్ పై చర్చకు ప్రతిపక్షాల పట్టుబట్టడంతో.. అందుకు అంగీకరించిన ప్రభుత్వం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రధాని కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, కిరెన్ రిజిజు, అర్జున్ మేఘవాల్ తదితర మంత్రులు పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై వచ్చే వారం చర్చకు అనుతించాలని హైలెవల్ మీటింగ్ లో నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోక్ సభలో 16, రాజ్యసభలో 9 గంటల చర్చ జరపాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు.. మంగళవారానికి (జులై 22) 11 గంటల వరకు వాయిదా వేశారు.
అధికార విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య గందరగోళం:
సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే గందరగోళానికి దారి తీశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు పట్టుబట్టడంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ డిమాండ్లను ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని అన్నారు స్పీకర్ ఓం బిర్లా. సభలో నినాదాలు చేయడం సరికాదని అన్నారు ఓం బిర్లా.
స్పీకర్ మాటలను ఏమాత్రం పట్టించుకోని విపక్ష సభ్యులు సభలో నిరసనకు దిగారు. విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇదిలా ఉండగా.. ఈ సెషన్లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, ఇతర బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది.
వీటితోపాటు ఇన్‌కంట్యాక్స్-–2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానుంది.