బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయి. కౌంటర్ల దగ్గర జరుగుతున్న ట్రాన్సాక్షన్ వాల్యూలో క్యాష్ వాడకం 2022 లో 27 శాతానికి పడిపోయిందని ఎఫ్‌ఐఎస్ గ్లోబల్ పేమెంట్స్ రిపోర్ట్–2023 వెల్లడించింది. 2019 లో ఈ నెంబర్ 71 శాతంగా ఉండేదని తెలిపింది. రియల్ టైమ్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీపీ), యూపీఐ వంటి టెక్నాలజీతో డిజిటల్ పేమెంట్స్‌లో ఇండియా దూసుకుపోతోందని పేర్కొంది.
దీంతో ఈ–కామర్స్ అకౌంట్ టూ అకౌంట్ (అంటే యూజర్ నుంచి పేమెంట్ డైరెక్ట్‌గా మర్చంట్ బ్యాంక్ ఖాతాలోకి పడడం) పేమెంట్స్ 2022 లో 12 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది 2021 లెవెల్‌తో పోలిస్తే 53 శాతం ఎక్కువని వివరించింది. కన్జూమర్లు ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో ఎలా డబ్బులు చెల్లిస్తున్నారనే దానిపై ఎఫ్‌ఐఎస్ స్టడీ చేసింది. మొత్తం 40 గ్లోబల్ మార్కెట్లలో ఈ స్టడీ జరిపింది. గ్లోబల్‌గా 70 రియల్ టైమ్ పేమెంట్ స్కీమ్‌లు ఉన్నాయని, ఫలితంగా ఈ–కామర్స్ సెక్టార్‌లో అకౌంట్ టూ అకౌంట్ (ఏటూఏ) ట్రాన్సాక్షన్లు విలువ 2022 లో 525 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఎఫ్‌ఐఎస్ రిపోర్ట్ పేర్కొంది.
2021 లో ఈ నెంబర్ 463 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. దేశంలో యూపీఐ వేగంగా విస్తరిస్తోందని, డిజిటల్ పేమెంట్స్‌లో లీడర్‌గా కొనసాగుతోందని పేర్కొంది. ఎఫ్‌ఐసీ రిపోర్ట్ ప్రకారం, మొత్తం పేమెంట్స్‌లో క్యాష్ ట్రాన్సాక్షన్ల విలువ 2026 నాటికి 34 శాతం తగ్గుతుంది. డిజిటల్ వాలెట్స్ ట్రాన్సాక్షన్ల విలువ 88 శాతం పెరుగుతుంది. ఈ–కామర్స్ మార్కెట్ సైజ్ 2026 నాటికి 82 శాతం పెరుగుతుంది.
టాటా సూపర్ యాప్ మరింత మెరుగ్గా!
ఈ-కామర్స్ బిజినెస్‌ను మరింతగా విస్తరించాలని టాటా గ్రూప్ చూస్తోంది. తమ ప్రొడక్ట్‌లన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు టాటా న్యూ యాప్‌ను కంపెనీ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ను మరింతగా విస్తరించేందుకు సుమారు 2 బిలియన్ డాలర్ల (రూ.16,400 కోట్ల) ను ఇన్వెస్ట్ చేయాలని టాటా గ్రూప్ చూస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ పేరెంట్ కంపెనీ టాటా డిజిటల్‌కు వచ్చే రెండేళ్లలో ఈ ఫండ్స్‌ను టాటా గ్రూప్ అందించనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని టాటా గ్రూప్ కాని, టాటా డిజిటల్ కాని నిర్ధారించలేదు. ఆన్‌లైన్ ద్వారా మరిన్ని ప్రొడక్ట్‌లను అందించడానికి, టాటా న్యూ యాప్ టెక్నాలజీని మెరుగుపరచడానికి ఈ ఫండ్స్ సాయపడతాయి.
చైనాలోని ఆలిపే, వీ చాట్ మాదిరే టాటా న్యూని కూడా డెవలప్ చేశారు. ఈ సూపర్ యాప్ ద్వారా గ్రోసరీస్ నుంచి గ్యాడ్జెట్లు, ఫ్లయిట్ టికెట్లు వరకు అన్నీ కొనొచ్చు. అంతేకాకుండా బిల్ పేమెంట్లు, లోన్లు, ఇన్సూరెన్స్ వంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లనూ టాటా న్యూ యాప్ అందిస్తోంది. టాటా న్యూ యాప్‌ను కిందటేడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి తెచ్చారు. కానీ, టెక్నికల్ సమస్యల వలన యాప్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. కాగా, టాటా న్యూ వాల్యుయేషన్‌ను పెంచాలని టాటా డిజిటల్‌ను టాటా గ్రూప్ అడిగింది.
