ఓరుగల్లు చెరువులకు డిజిటల్ రక్ష.. డిజిటల్ మ్యాపులతో కబ్జాదారుల ఆగడాలకు చెక్

ఓరుగల్లు చెరువులకు డిజిటల్ రక్ష.. డిజిటల్ మ్యాపులతో కబ్జాదారుల ఆగడాలకు చెక్
  • లైడార్​ సర్వేతో బౌండరీలు ఫిక్స్ చేస్తున్న అధికారులు​
  • 3 మండలాల్లో 73 చెరువుల్లో తొలి విడత లైడార్ సర్వే  
  • రెవెన్యూ రికార్డుల మేరకు చెరువుల హద్దులు నిర్ణయం 
  • డిజిటల్ మ్యాపులను కుడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామంటున్న ఆఫీసర్లు 

హనుమకొండ, వెలుగు: కాకతీయుల కాలం నుంచి ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చిన వరంగల్ సిటీలోని చెరువులు కబ్జాల పాలయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువుల గొలుసుకట్టు తెగిపోయి ఎఫ్టీఎల్ పరిధిలో కాలనీలు, ప్రైవేటు వెంచర్లు వెలిశాయి. దీంతో వర్షాలు పడినప్పుడల్లా వరదంతా కాలనీలను ముంచెత్తే పరిస్థితి నెలకొంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​తరహాలోనే గ్రేటర్ వరంగల్ లో కూడా చెరువుల పరిరక్షణపై దృష్టిపెట్టింది. 

ఇందులో భాగంగా ముందుగా గొలుసుకట్టు చెరువుల సర్వే చేయిస్తోంది. ఇప్పటికే తొలి విడతతో పలు చెరువుల్లో లైడార్ సర్వే పూర్తయింది. మిగతా వాటిల్లో త్వరలోనే సర్వే చేపట్టి, రెవెన్యూ రికార్డుల మేరకు సరిహద్దులు నిర్ణయిస్తామని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. హెచ్ఎండీఏ లో మాదిరిగానే కుడాలోనూ చెరువుల డిజిటల్ మ్యాపులు రూపొందిస్తామంటున్నారు.  

కబ్జాల పాలై కాలనీలు పుట్టుకొచ్చాయి.. 

వరంగల్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుండడం, భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతుండడంతో  202 గొలుసుకట్టు చెరువుల్లో 42 దాకా మాయం అయ్యాయి. ఎఫ్టీఎల్ పరిధిలో కాలనీలు పుట్టుకొచ్చాయి. దీంతో చెరువుల విస్తీర్ణం తగ్గిపోయింది. ఆక్రమ నిర్మాణాలతో  చెరువులు, కుంటల గొలుసుకట్టు తెగిపోయింది. సిటీ మధ్యలోని భద్రకాళి చెరువు 350 ఎకరాలకు దాదాపు 60 ఎకరాలు కబ్జాకు గురై కాలనీలు ఏర్పడ్డాయి. 

ములుగు రోడ్డులోని కోట చెరువు 159 ఎకరాలకు సుమారు 30 ఎకరాలు,  హనుమకొండ వడ్డేపల్లి చెరువు 336 ఎకరాలకు సుమారు 30 ఎకరాలు, ఉర్సు రంగసముద్రం చెరువు126 ఎకరాలకు 20 ఎకరాలు, గొర్రెకుంట కట్టమల్లన్న చెరువు 21 ఎకరాలకు 8 ఎకరాలు, మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకు 40 ఎకరాలు, గోపాలపూర్ ఊర చెరువు 23.10 ఎకరాలకు దాదాపు10 ఎకరాలు, తిమ్మాపూర్ బెస్తం చెరువు 105 ఎకరాలకు 40 ఎకరాలకు పైగా కబ్జాల పాలయ్యాయి. సిటీలోని మిగతా చెరువుల పరిస్థితి ఇలానే ఉంది. 

గత బీఆర్ఎస్ హయాంలోనే కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే ఆ పార్టీకి చెందిన అప్పటి ప్రజాప్రతినిధులు చెరువు శిఖం భూముల్లోనే ప్రైవేటు వెంచర్లు, గెస్ట్ హౌజ్ లు నిర్మించారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మాణానికి రంగశాయిపేటలోని పుల్లాయికుంటను కొంతమేర పూడ్చి కబ్జా చేయడం అప్పట్లో 
చర్చనీయాంశమైంది. 

తొలివిడతలో లైడార్ సర్వే కంప్లీట్

వరంగల్ సిటీలో 2020లో కురిసిన భారీ వర్షాలకు దాదాపు130 వరకు కాలనీలు నీటమునిగాయి. ఆ తర్వాత ఆక్రమణల గుర్తింపునకు హడావుడి చేసిన గత పాలకులు చివరకు చేతులెత్తేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చెరువుల పరిరక్షణపై దృష్టి పెట్టడడంతో  ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేపట్టారు. తొలి విడతలో వరంగల్, ఖిలా వరంగల్, హనుమకొండ మండలాల్లోని 73 చెరువుల్లో డిజిటల్ సర్వే పూర్తి చేశారు. కాజీపేట, హసన్ పర్తి మండలాల చెరువులను రెండో విడతలో సర్వే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

కాగా, ఇప్పటికే  సర్వే చేసిన  భద్రకాళి, చిన్న వడ్డేపల్లి, గోపాలపూర్ ఊర చెరువు, కోట చెరువు, బంధం చెరువుల్లో  విస్తీర్ణం, నీటి సామర్థ్యం, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు, చెట్లు, ఇతర పరిస్థితులను త్రీడీలో చిత్రీకరించారు. ఇందుకు దాదాపు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. సర్వే డిజిటల్ మ్యాపులను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు కూడా పంపించారు. 

డిజిటల్ మ్యాప్స్ చూసుకునేలా..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని చెరువులను డిజిటల్ సర్వే ద్వారా  సమగ్ర వివరాలను హెచ్ఎండీఏ లేక్స్ సైట్ లో ఉంచారు. వరంగల్ లో కూడా డిజిటల్ మ్యాపులను 'కుడా' సైట్ లో అందుబాటులో ఉంచేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. లైడార్ సర్వే ద్వారా డిజిటల్ మ్యాపులు రెడీ చేయగా.. వాటిని గూగుల్ లో చూసుకునేలా కేఎంఎల్ ఫైల్ గాను కలెక్టర్లకు అందించారు.  

అనంతరం రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి.. సరిహద్దులు నిర్ణయించి.. సమగ్ర వివరాలతో  కాకతీయ అర్బన్ డెవలప్ అథారిటీ(కుడా)కు అందజేస్తారు. ఆ తర్వాత ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక  ‘ కుడా’ లేక్స్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. దీంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను సులువుగా గుర్తించడంతో పాటు చెరువుల ఆక్రమణకు చెక్ పెట్టే చాన్స్ ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.

మ్యాపులను డిజిటలైజ్ చేస్తాం

గ్రేటర్ వరంగల్ పరిధి మూడు మండలాల్లోని చెరువుల్లో తొలివిడత లైడార్ సర్వే పూర్తి చేశాం. మిగతా చెరువుల సర్వేను రెండో విడతలో నిర్వహిస్తాం. ఆ తర్వాత చెరువుల హద్దులను నిర్ణయించి, మ్యాపులను డిజిటలైజ్ చేస్తాం. ప్రిలిమినరీ,ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ‘కుడా’ వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచుతాం. అనంతరం చెరువులు సమగ్ర వివరాలు ఎవరైనా తెలుసుకోవచ్చు.     

- హర్షవర్ధన్, ఇరిగేషన్ డీఈఈ, హనుమకొండ