బంద్ అంటూనే షూటింగ్ కొనసాగిస్తున్న దిల్ రాజు

బంద్ అంటూనే షూటింగ్ కొనసాగిస్తున్న దిల్ రాజు

నిర్మాత దిల్ రాజు వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. టిక్కెట్‌ ధరలు, ఓటీటీ విడుదల, కార్మికుల దినసరి వేతనం తదితర సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆగస్టు 1 నుంచి అన్ని సినిమా షూటింగ్లు బంద్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. అయితే గంటల గడవక ముందే ఆయన మాట తప్పాడు. వైజాగ్ పోర్టు ఏరియాలో తన సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తూ అందరికీ షాకిచ్చాడు. 

నిజానికి సినిమా షూటింగ్ ల బంద్ కు ప్రేరేపించి, అందరినీ సమీకరించిన వ్యక్తి దిల్ రాజు. ఆయనే ఇప్పుడు షూట్ కొనసాగించడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ మండిపడుతోంది. అయితే దీనిపై స్పందించిన దిల్ రాజు ఓ లాజిక్ పాయింట్ చెప్పాడు.  తన నిర్మాణంలో విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో చేస్తున్న వారసుడు సినిమా తమిళ సినిమా కిందకు వస్తుందని అందుకే షూటింగ్ ఆపలేదని వివరణ ఇచ్చుకున్నాడు. అది బై లింగ్యువల్ మూవీ కదా అన్న ప్రశ్నకు షూటింగ్ తమిళంలో జరుగుతుందని తెలుగులోకి డబ్ మాత్రమే చేస్తారని సమాధానమిచ్చాడు. తాను బంద్ పాటిస్తున్నాని, అందుకే తెలుగు సినిమా షూటింగ్ లు ఏవీ చేయడం లేదని చెప్పుకొచ్చాడు.

షూటింగ్ల బంద్కు ప్రేరేపించి స్వయంగా చిత్రనిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న నిర్మాత దిల్ రాజు వైఖరిపై టాలీవుడ్ చిన్న నిర్మాతలు మండిపడుతున్నారు. గిల్డ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఇప్పుడు షూటింగ్ లు చేయడాన్ని తప్పుబడుతున్నారు. దిల్ రాజు వారసుడు సినిమా బై లింగ్యువల్ అని అలాంటప్పుడు చిత్రీకరణ ఎలా జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. ఏ బాషలో చిత్రీకరణ జరుగుతున్నా  దానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు, కార్మికులంతా తెలుగువాళ్లే అన్న విషయాన్ని  దిల్ రాజు మర్చిపోతున్నారని మిగతా నిర్మాతలు విమర్శిస్తున్నారు. 
 తెలుగు, తమిళం, మలయాళం పేర్లు చెప్పి షూటింగ్ కంటిన్యూ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు.