కర్నాటకలో చేసి చూపించాం .. ఇక్కడా మాట నిలబెట్టుకుంటాం : దినేశ్  గుండూరావు

కర్నాటకలో చేసి చూపించాం .. ఇక్కడా మాట నిలబెట్టుకుంటాం : దినేశ్  గుండూరావు
  • కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ఆ రాష్ట్ర మంత్రి దినేశ్  గుండూరావు
  • గొప్పలు చెప్పుకోవడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు
  •  సీఎం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్

తొర్రూరు,వెలుగు : కర్నాటకలో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామని, ఇక్కడ కూడా తాము ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకుంటామని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్  గుండూ రావు అన్నారు. కర్నాటకలో తాము హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్  నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో బుధవారం కాంగ్రెస్  క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుండూరావు మాట్లాడారు. కర్నాటకలో తమ హామీలు అమలవుతున్నాయో లేదో వచ్చి చూడాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తే ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్  అదేపనిగా అబద్ధాలు చెబుతూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ‘‘కర్నాటకలో మేం ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలవుతున్నాయి. అలాగే యువనిధి పథకాన్ని వచ్చే ఏడాది జనవరిలో మొదలు పెడుతున్నాం. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కానీ, మేము హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్  నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

రైతులకు అక్కడ నాణ్యమైన విద్యుత్  అందిస్తున్నాం” అని గుండూరావు తెలిపారు. బీర్ఎస్ నేతల దుష్ప్రచారాన్ని నమ్మకూడదని, కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.  తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ ను గద్దె దించాల్సిన సమయం వచ్చిందన్నారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప కేసీఆర్   చేసిందేమీ లేదన్నారు. ‘‘బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. అవినీతి డబ్బుతో ఎన్నికలకు వెళ్లడం ఆయనకు అలవాటైంది. ఈసారి ఆయన ప్రయత్నాలు ఫలించవు.

తెలంగాణలో ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్‌  ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజలు 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు” అని గుండూరావూ పేర్కొన్నారు. ఇక బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరు కాదని, బీజేపీకి బీఆర్‌ఎస్‌బీ టీంగా పనిచేస్తోందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో కర్నాటక పీసీసీ జనరల్  సెక్రటరీ డాక్టర్  గుర్రపు నాయుడు, కాంగ్రెస్  నియోజకవర్గ ఇన్ చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, పార్లమెంట్ ఇన్ చార్జి శోభారాణి, నాయకులు హరిప్రసాద్​రావు, సంతోష్​, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.