సీబీఐకి మరిన్ని అధికారాలివ్వాలి : పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక

సీబీఐకి మరిన్ని అధికారాలివ్వాలి : పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక
  • కేసు దర్యాప్తుల్లో రాష్ట్రాల జోక్యం ఉండకుండా చూడాలి
  • ఎంక్వైరీలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నయ్
  • కొత్త చట్టం తేవాలని సూచన

న్యూఢిల్లీ :  సీబీఐ అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ సోమవారం అభిప్రాయపడింది. కొన్ని కీలక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సీబీఐకి సహకారం అందడంలేదని నివేదించింది. దీంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగట్లేదని, ఎంక్వైరీలో కూడా పారదర్శకత లోపిస్తున్నదని చెప్పింది. కొన్ని రాష్ట్రాలు సీబీఐ అధికారులను అడ్డుకుంటున్నాయని తెలిపింది. సీబీఐకి మరిన్ని అధికారాలు కల్పిస్తూ.. కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండానే.. కేసులు విచారించగలిగేలా అధికారం ఇవ్వాలని సూచించింది. అదేవిధంగా, సీబీఐ పనితీరుపై కూడా దృష్టి సారించాలని చెప్పింది. అధికారుల వ్యవహార శైలితో కొన్ని రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయని తెలిపింది.

దర్యాప్తును అడ్డుకుంటున్న రాష్ట్రాలు

సీబీఐ పనితీరును నియంత్రించే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్​మెంట్(డీఎస్​పీఈ) చట్టంలోని నిబంధనల ప్రకారం.. కేసు దర్యాప్తు చేయాలంటే సీబీఐ ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కేసుల దర్యాప్తు కోసం సీబీఐకి ఇచ్చిన అనుమతిని 9 రాష్ట్రాలు వాపస్​ తీసుకున్నాయని పార్లమెంటరీ ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది. సీబీఐని అడ్డుకోవడం వల్ల ఆ రాష్ట్రాల్లో అవినీతి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పెరుగుతాయని ప్యానెల్ అభిప్రాయపడింది. ఇంతకుముందు సిఫార్సు చేసిన విధంగా.. డీఎస్​పీఈ చట్టం, 1946  కాకుండా.. కొత్త చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ చెప్పింది. రాష్ట్ర అనుమతి, జోక్యం అవసరం లేకుండా స్వతంత్రంగా దర్యాప్తు చేపట్టేలా సీబీఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని సూచించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం వాడుకుంటున్నదనే విమర్శలు ఉన్నాయి. ఇన్​స్పెక్టర్​ సహా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్​మెంట్ నిబంధనల్లో సవరణలు చేయాలని ప్యానెల్​ను ఇటీవల సీబీఐ కోరింది.

రెండు సిఫార్సులకు నో చెప్పిన కేబినెట్

క్రిమినల్ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. హోంమంత్రి అమిత్ షా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. గే సెక్స్, వ్యభిచారాన్ని నేరంగా పరిగణించాలనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనలను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ తిరస్కరించినట్లు సమాచారం. చట్ట సవరణలో వీటి జోలికి పోవద్దని కేబినెట్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. వాటిని నేరాలుగా పరిగణించడం.. సుప్రీం తీర్పులకు విరుద్ధమని కేబినెట్ భావించినట్లు తెలుస్తున్నది.