పంచాయతీ కార్మికులకు మినిమం వేతనాలు ఇచ్చేందుకు ఒప్పుకోని సర్కారు

పంచాయతీ కార్మికులకు మినిమం వేతనాలు ఇచ్చేందుకు ఒప్పుకోని సర్కారు
  • చెత్త తరలించేందుకు ప్రైవేట్ కూలీలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు
  • ఒక్కొక్కరికి రోజుకు రూ.500 నుంచి రూ.600 చెల్లిస్తున్న సర్పంచులు
  • ఇవే జీతాల కోసం మల్టీపర్పస్ వర్కర్లు సమ్మె చేస్తున్నా స్పందన కరువు

మహబూబ్​నగర్/చిన్నచింతకుంట, వెలుగు: ‘సార్​.. మా ప్రాణాల్ని పణంగా పెట్టి పల్లెల్లో పారిశుధ్య పనులు చేస్తున్నం.. చెత్త ఎత్తి, మోర్లు క్లీన్ చేసి జనాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నం.. పంచాయతీలకు అవార్డులు తెస్తున్నం.. కానీ ఇప్పుడొస్తున్న సాలరీ కుటుంబపోషణకు సరిపోతలేదు.. రోజుకు రూ.300 కూడా పడ్తలేదు. మినిమం వేతనం కింద నెలకు రూ.19వేలు ఇప్పించండి’ అంటూ పంచాయతీల్లోని మల్టీపర్పస్​ కార్మికులు నెల రోజలుగా ఆందోళన చేస్తున్నారు. కానీ, వారు అడుగుతున్న కనీస వేతనాలు ఇచ్చేందుకు చేతులు రాని సర్కారు, వారి స్థానాల్లో పారిశుధ్య పనులు చేసేందుకు ప్రైవేట్​కూలీలను పెట్టాలని ఆదేశించింది. ఒక్కో కూలీకి  రోజుకు రూ.500 నుంచి వెయ్యి దాకా చెల్లించాల్సి వస్తోంది. ఇవే జీతాలు తాము అడిగితే ఇవ్వకుండా ప్రైవేట్​కూలీలకు ఇవ్వడమేమిటని మల్టిపర్పస్​ వర్కర్లు ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేట్​ కార్మికులకు వెయ్యి దాకా.. 

రాష్ర్టంలో 12,769 గ్రామ పంచాయతీ (జీపీ)లు ఉన్నాయి. ఇందులో చిన్న జీపీలలో ఇద్దరు, ముగ్గురు చొప్పున, పెద్ద జీపీలలో నలుగురైదుగురు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా 55 వేల మంది మల్టీపర్పస్ వర్కర్లు పని చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి జీవో 60 ప్రకారం మినిమం రూ.19 వేల జీతాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసి తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్​ చేయాలనే డిమాండ్లతో సమ్మెకు దిగారు. వీరిని కనీసం చర్చలకు పిలవని  రాష్ర్ట ప్రభుత్వం, పంచాయతీల్లో పారిశుధ్య పనుల కోసం ప్రైవేట్ కూలీలను ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల అన్ని జిల్లాల ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది. 

దీని ప్రకారం వారం కింద జిల్లా ఆఫీసర్లు..సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి జీపీలలో ప్రైవేట్ కూలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  నాలుగైదు రోజులుగా వీరు ప్రైవేట్ కూలీలు, డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో చెత్త సేకరిస్తున్నారు. ఇందు కోసం మహిళా కూలీలకు రూ.500, మగ కూలికి రూ.600, ట్రాక్టర్ డ్రైవర్​కు  రూ.800 నుంచి రూ.వెయ్యిదాకా చెల్లిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్లు రిపేర్లయి, పని చేయని చోట ట్రాక్టర్లను రోజుకు రూ.1000 నుంచి 
రూ.1,500కు అద్దెకు తీసుకుంటున్నారు.

మల్టీపర్పస్ వర్కర్​కు చెల్లిస్తున్నది రూ.250 మాత్రమే..

ప్రస్తుతం మల్టీపర్పస్ వర్కర్లకు  వెయ్యిలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో రూ.8,500.. 1,500 పైచిలుకు జనాభా ఉన్న జీపీలో రూ.9,500 ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ లెక్క ప్రకారం వీరికి రోజుకు రూ.250 నుంచి రూ.300 కూలీ మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాలతో ఆఫీసర్లు తీసుకున్న ప్రైవేట్ వర్కర్లకు రోజుకు మినిమం రూ.500 నుంచి రూ.600 చెల్లిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం చూసినా మల్టీపర్పస్​ వర్కర్లకు నెలకు రూ.18 వేల దాకా చెల్లించవచ్చు. మల్టీపర్పస్ వర్కర్లు అడుగుతున్నది కూడా ఇదే. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లే తమకు సైతం రూ.19  వేల కనీస వేతనం చెల్లించాలని  డిమాండ్ చేస్తున్నారు.

జీతాలు కట్​ చేస్తరట..

సమ్మెలో ఉన్న కార్మికుల పట్ల రాష్ర్ట సర్కారు కఠిన నిర్ణయం తీసుకుంది. మల్టీపర్పస్ వర్కర్లకు జీపీ అకౌంట్ల నుంచి జీతాలు చెల్లిస్తుండగా, ప్రస్తుతం ప్రైవేట్ కూలీలకు చెల్లిస్తున్న డబ్బులను వర్కర్ల జీతాల నుంచి కట్ చేసి ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలిచ్చింది.  దీంతో గురువారం నాటికి వర్కర్లు 29 రోజుల జీతాన్ని పోగొట్టుకోనున్నారు. అలాగే సమ్మెలో పాల్గొంటున్న మల్టీపర్పస్​ వర్కర్లపై రూలింగ్ పార్టీకి చెందిన కొందరు సర్పంచులు దౌర్జన్యానికి దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే పనుల్లోకి రాకుంటే తీసేస్తామని బెదిరిస్తున్నారని పలువురు కార్మికులు వాపోతున్నారు.

పొట్టకూటి కోసం మురుగు ఎత్తిపోస్తున్నం

పొట్టకూటి కోసం పాణాల్ని పణంగా పెట్టి మురుగు ఎత్తిపోస్తున్నం. మా పేదరికమే మాతో ఈ పని చేయిస్తోంది. కానీ, మా కష్టాన్ని రాష్ర్ట ప్రభుత్వం గుర్తిస్తలేదు.  నాకు భూమి లేదు. ఇద్దరు పిల్లలున్నరు. వారిని పోషించేందుకే గ్రామ పంచాయతీ వర్కర్ గా పనిచేస్తున్న. డ్రైనేజీలు శుభ్రం చేయడం వల్ల నెలకు ఒక్కసారైనా  అనారోగ్యం పాలవుతున్న. మేం ఏం అడుగుతున్నం. న్యాయంగా చేసిన కష్టానికి తగిన జీతం ఇయ్యమంటున్నం. ఇప్పుడు ప్రైవేట్ కూలీలకు చెల్లిస్తున్నట్లే మాకు చెల్లిస్తే మా కుటుంబాలను పోషించుకుంటం. సర్కారు ఆలోచించాలె..
- డి.శ్రీనివాసులు, జీపీ వర్కర్, లాల్కోట గ్రామం, చిన్నచింతకుంట మండలం

వర్కర్ల ఐక్యతను దెబ్బతీస్తున్నరు

వర్కర్ల ఐక్యతను కొందరు అధికార పార్టీ లీడర్లు దెబ్బతీస్తున్నరు. గ్రామాల్లో సర్పంచులు కార్మికుల మధ్య చిచ్చుపెట్టి, సమ్మెకు రాకుండా చూస్తున్నరు. కష్టాల్లో ఉన్నప్పుడు వర్కర్లకు లీడర్లు అండగా నిలవాలె. మా జీతాలు, మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకునేందుకు సహరించాలె.
- వెంకటయ్య, జీపీ వర్కర్, డోకూర్ గ్రామం, దేవరకద్ర మండలం